తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ రెడ్డి
ప్రాజెక్ట్ ఎత్తు, ముంపు ప్రభావంపై
అధ్యయనం చేయాలని సూచన
ముంబయిలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ
గత ఒప్పంద పున:పరిశీలనకు అభ్యంతరం లేదు :మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్‌పై మహారాష్ర్ట ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రాణహిత నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో సోమవారం కీలక సమావేశం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం సమావేశమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ ఎత్తు, ముంపు ప్రభావం తదితర అంశాలపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డి తుమ్మిడి హెట్టి ప్రాధాన్యతను ఫడ్నవీస్‌కు వివరించారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని తెలిపారు. అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొమురం భీం సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధితో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని వివరిం చారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజె క్టు మాత్రమే కాదనీ, రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమాని కి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎత్తుపై స్వతంత్రంగా అధ్యయనం : ఫడ్నవీస్
తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ వల్ల మహారాష్ర్టపై ప్రతికూల ప్రభావం లేకపోతే నిర్మాణానికి గతంలో కుదిరిన ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు తమకు అభ్యంత రం లేదని మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో పాటు స్వతంత్రంగా అధ్యయనం చేపట్టేందుకు తమ ప్రభు త్వం నిర్ణయించిందని తెలిపారు. బ్యారేజీ నిర్మాణ స్థలం, వివిధ ఎత్తుల వద్ద ముంపు ప్రభావం, అవసరమైన భూమి విస్తీర్ణాన్ని ఈ అధ్యయనంలో పరిశీలిస్తామని తెలిపారు. మహారాష్ట్ర అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలు, అంచనాలపై తెలంగాణకు అభ్యంతరాలుంటే రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి పరిశీలిస్తారని చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. వాస్తవాలు, సాంకేతిక అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలని ఇరు రాష్ర్టాల అధికారులకు సూచించారు.
152 మీటర్ల ఎత్తుతో నష్టం లేదు : మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును నిర్మిస్తే మహారాష్ర్టకు పెద్దగా నష్టం ఉండదని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణంతో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు మహారాష్ర్టలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2016లో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఆ ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని వివరించారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమనీ, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమని ఉత్తమ్ వివరించారు.
ఇన్వెస్ట్ సదస్సుకు ఫడ్నవీస్‌కు ఆహ్వానం.....
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు హాజరుకావాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. సదస్సుకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె.రామకృష్ణారావు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)