గుర్తింపు పొందిన కార్మిక సంఘంతోనే వేతన ఒప్పందం జరిగేలా చూడాలి
సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలనీ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం ద్వారానే యాజ మాన్యం వేతన ఒప్పందం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ బుధవారం లేఖ రాశారు. 2014లో మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లును 2018లో జేకే యాజమాన్యం తిరిగి ప్రారంభించిందనీ, రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్ సబ్సిడీలతో పాటు అనేక రాయితీలను యాజమాన్యానికి కల్పించిందని గుర్తుచేశారు. ఆ పరిశ్రమ ఇప్పుడు లాభాల బాటలో కొనసాగుతున్నప్పటికీ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులకు మాత్రం న్యాయమైన హక్కులు దక్కట్లేదని ఎత్తిచూపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం సుమారు రూ.100 కోట్ల విలువైన రాయితీలు పొందినప్పటికీ, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను సాకుగా చూపుతూ గుర్తింపు ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.
ఎన్నికల నిర్వహణపై కార్మికులు 166 రోజులుగా మిల్లు ప్రధానగేటు ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా యాజమాన్యం కాలయాపన చేయడం దారుణమని పేర్కొన్నారు. గత వేతన ఒప్పందం 2026 మార్చి 31తేదీతో ముగిసిందనీ, ఇప్పటివరకు కొత్త వేతన ఒప్పందం జరగలేదని తెలిపారు. యాజమాన్యం కొంతమందిని ప్రోత్సహిస్తూ కార్మికుల మధ్య ఐక్యతను దెబ్బతీసే యత్నాలు చేస్తున్నదనీ, జిల్లాలో బీజేపీ ఎంపీ, సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్మికుల గుర్తింపు ఎన్నికల సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఇటీవల సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు తమను కలసి సమస్యలను వివరించారనీ, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గుర్తింపు ఎన్నికలు నిర్వహించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న న్యాయపర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. కొత్త వేతన ఒప్పందం జరిగే వరకు ప్రతి కార్మికుడికీ నెలకు రూ.10 వేల చొప్పున మధ్యంతర ఆర్థిక భరోసా కల్పించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని విన్నవించారు.





కామెంట్లు (0)