Magazines

‌ఢిల్లీ పార్టీలతో న్యాయం జరగదు

20 నిమిషాల క్రితం

justice
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు..రేవంత్‌‌రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి

మియాపూర్‌‌లో 550 ఎకరాల అమ్మకంపై తొందరెందుకు?

అమిత్‌‌షాకు బౌన్సర్‌‌లా కేంద్రమంత్రి బండి సంజయ్‌

ఉత్త చేతులతోనే వచ్చారు..ఒక్క ప్రాజెక్టునైనా ఇచ్చారా ?

అమిత్‌‌షాకు కేటీఆర్‌ ప్రశ్న


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగబోదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వ కుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకత్వాల ముందు కాంగ్రెస్‌, బీజేపీలు తాకట్టు పెడుతున్నా యని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తోందని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన ‌కాంగ్రెస్‌ నాయకుడు అవుకు దామోద‌ర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చే‌రారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సం దర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ సెక్యూరిటీ సిబ్బంది తోయడంతోనే రేవంత్‌రెడ్డి‌కి ఉన్న గౌరవం ఏంటో తేలిపోయిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలతోనే పాలన సాగిస్తు న్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద ర్‌రావు కంటే చిన్నవాడైన అమి‌త్‌షా కాళ్లకు నమస్కరించాల్సిన పరిస్థితి రావడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చడమే‌నని అన్నారు. అమిత్‌షా ముందు ‌కేంద్రమంత్రి బండి సంజయ్ బౌన్సర్లలా వ్యవహరించారని చెప్పారు.

అమిత్‌షా తెలంగాణకు ఉత్త చేతులతో వచ్చి వెళ్లిపోయార‌నీ, రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు, జాతీయ స్థాయి విద్యాసంస్థనైనా తీసుకురాలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పగబట్టిందని చెప్పారు. తెలంగాణ నీటి హక్కులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. హైదరాబాద్‌లో మళ్లీ తాగునీటి, విద్యుత్ సమస్యలు రావడమే కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారని గుర్తు చేశారు. రేవంత్‌‌రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇల్లయినా నిర్మించారా?అని అడిగారు. ఎన్నికల హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రేవంత్ రెడ్డికి పాలనపై దృష్టి లేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందనీ, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మియాపూర్‌‌లో అమరవీరుల కుటుంబాలకు ఇండ్లస్థలాలివ్వాలి

మియాపూర్‌లో 550 ఎకరాల భూముల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వానికి తొందరెందుకని కేటీఆర్‌ ప్రశ్నించారు. తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని అడిగారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం కమీషన్ల కోసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. మియాపూర్ భూముల్లో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, హైదరాబాద్‌‌లోని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. హిల్ట్‌ పాలసీ పేరుతో కమీషన్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన విలువైన భూములను ‌ప్రయివేటు ప్రయోజనాల కోసం విక్రయించడం దారుణమని విమర్శించారు.

విద్యుత్ కోతలతో మళ్లీ జనరేటర్లు,
ఇన్వర్టర్లకు డిమాండ్

కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండటంతో ఇండ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్ల అవసరం తగ్గిపోయిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలు తిరిగి జనరేటర్లు, ఇన్వర్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బొగ్గు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడం, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌‌రాజు, విప్‌ కెపి వివేకానంద, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్