Magazines

తెలంగాణ కులగణన దేశానికే రోల్‌ ‌మోడల్‌‌

22 నిమిషాల క్రితం

Telangana
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ అభివృద్ధిలో యాదవుల పాత్ర మరువలేనిది

శ్రీకృష్ణ సదర్‌ ఉత్సవంలో సీఎం రేవంత్‌‌రెడ్డి

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి

బీహార్‌ ‌మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికే రోల్‌ ‌మాడల్‌‌గా నిలిచిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అన్నారు. దేశంలోని అనేక రాష్ర్టాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనను ప్రామాణికంగా తీసుకుందని వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్‌ ‌స్టేడియంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సదర్‌ అంటే తెలంగాణ ఆత్మగౌరవమని కొనియాడారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదవులను అన్ని విధాలుగా గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామనీ, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లంకొండ అని ప్రస్తావించారు.


యాదవ సోదరుల సహకారంతోనే నగరం ఇంతగా అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. సదర్‌ వేడుకలను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తున్నామనీ, ఇందుకు రూ.5 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు. మూసీ పునరుద్ధరణ, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామనీ, దీనికి యాదవ సోదరులు సహకారం అందించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పశుసంపద అభివృద్ధి ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సదర్ ద్వారా యాదవ సంస్కృతి ప్రపంచానికి చాటడమే కాదు, ఆర్థిక వ్యవస్థలో వారు భాగస్వామ్యమవ్వాలని ఆకాంక్షించారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాదవ్‌ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.


మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సదర్ వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తున్నాయని కొనియాడారు. అంతరించిపోతున్న ఆచారాలు, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే సదర్ సమ్మేళనం ఉద్దేశమని వ్యాఖ్యానించారు. కాగా సదర్‌ ఉత్సవాలకు రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి యాదవులు భారీగా తరలివచ్చారు. సదర్‌ ‌ప్రాంగణలో ఏర్పాటు చేసిన దున్నరాజుల ప్రదర్శనలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌మాజీ గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ​



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్