Magazines

ట్రంప్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

18 నిమిషాల క్రితం

Trump
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 6 నిమిషాల చదవడం

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఘోర పరాజయం

రెండు కాంగ్రెస్ సభల్లోనూ డెమొక్రాట్లకు స్పష్టమైన ఆధిక్యత..సత్తా చాటిన ఇండో- అమెరికన్లు


వాషింగ్టన్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లకు ఘోర పరాభవం ఎదురైంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక - విదేశాంగ విధానాలను, యుద్ధోన్మాద వైఖరిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ప్రతినిధిసభలోనూ, సెనెట్‌లోనూ ప్రతిపక్ష డెమొక్రాట్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కాంగ్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో ట్రంప్ పరిస్థితి కోరలు తీసిన పాము చందంగా తయారైంది. అధ్యక్ష పదవీకాలంలోని మిగిలిన రెండు సంవత్సరాలు ఆయనకు దినదిన గండమే. ట్రంప్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి పైన, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల పైన విచారణ జరిపించి అధ్యక్షుడిని బోనులో నిలబెట్టడానికి డెమొక్రాట్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఉభయసభల్లో సాధించిన మెజారిటీతో ట్రంప్‌పై మూడోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా వారికి లభించింది. పెరిగిపోయిన జీవనవ్యయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికన్లు తమ బ్యాలెట్ ద్వారా విలక్షణ తీర్పు ఇచ్చారు. సెనెట్ సమరంలో అత్యంత ఉత్కంఠను రేపిన కీలక రాష్ట్రాలు టెక్సాస్, ఒహియో, మిచిగాన్, జార్జియా, ఫ్లోరిడా, కాన్సాస్, మైన్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, అయోవాలో డెమొక్రాట్లు విజయకేత నం ఎగరేశారు.

ముఖ్యంగా అయోవా, కాన్సాస్, సౌత్ కరోలినా వంటి రిపబ్లికన్ల కంచుకోటలను బద్దలు కొట్టారు. సెనెట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో 20 స్థానాలను డెమొక్రటిక్ పార్టీ గెలుచుకుంది. అధికార రిపబ్లికన్లు 13 స్థానాలకే పరిమితమయ్యారు. మొత్తంమీద 100 స్థానాలున్న సెనెట్‌లో డెమొక్రటిక్ పార్టీకి 54 స్థానాలు, రిపబ్లికన్ పార్టీ 44 స్థానాలు ఉన్నాయి. అలాస్కా, మిసిసిపీ సెనెట్ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంలో ఒక్క డెమొక్రాట్‌ను కూడా గెలిపించని రాష్ట్రాలు సైతం ఈ రోజు ఆ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించి అందరినీ నివ్వెరపరచాయి. అమెరికా ప్రతినిధిసభలో కూడా డెమొక్రటిక్ పార్టీ మెజారిటీ మార్కును దాటింది. 435 మంది సభ్యులు ఉండే ప్రతినిధిసభలో సాధారణ మెజారిటీకి 218 స్థానాలు అవసరం కాగా కడపటి సమాచారం అందేసరికి డెమొక్రటిక్ పార్టీ 231 సీట్లను గెలుచుకుంది. రిపబ్లికన్లకు చెందిన 27 స్థానాలు డెమొక్రాట్ల ఖాతాలో చేరాయి. రిపబ్లికన్ పార్టీ 139 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.

కొంపముంచిన ఇంధన ధరలు, 
ఇరాన్ యుద్ధం : ట్రంప్

ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ డెమొక్రాట్లు మంచి పనితీరు ప్రదర్శించారని చెప్పారు. ఇరాన్ యుద్ధం, అధిక ఇంధన ధరలు తమ ఓటమికి కారణమయ్యాయని అంగీకరించారు. గ్యాస్ ధరలు రిపబ్లికన్ పార్టీని దెబ్బతీశాయని, ఇంధనం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడాన్ని ప్రజలు ఇష్టపడలేదని అన్నారు. ఫలితాలను అంగీకరించేందుకు సిద్ధంగానే ఉన్నానని అంటూనే ఇరాన్ యుద్ధంలో భాగస్వామి కావాలన్న అమెరికా నిర్ణయం వివేకవంతమైనదేనని తెలిపారు. తన పేరు బ్యాలెట్‌పై ఉంటే రిపబ్లికన్లు గెలిచి ఉండేవారని చెప్పుకొచ్చారు. తాను మద్దతు ఇచ్చిన కొందరు రిపబ్లికన్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారని వాపోయారు. భారీ ర్యాలీలు నిర్వహించిన రిపబ్లికన్లు ఓటమి చవిచూడడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. డెమొక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నానని అన్నారు. వారితో కలిసి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని అంటూనే అవసరమైతే వీటో హక్కును ఉపయోగిస్తానని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

రికార్డుల జోరు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నాలుగు రికార్డులు నమోదయ్యాయి. దేశ చరిత్రలో వామపక్ష డెమొక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయీద్ తొలి ముస్లిం సెనెటర్ అవబోతున్నారు. ఆయన మిచిగాన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను ఓడించారు. అమెరికా చరిత్రలో నల్లజాతి మహిళ కెషా లాన్స్ బాటమ్ తొలిసారిగా గవర్నరుగా ఎన్నికయ్యారు. జార్జియా గవర్నర్ పదవికి జరిగిన పోరులో ఆమె రిపబ్లికన్ అభ్యర్థిని రిక్ జాక్సన్‌ను మట్టికరిపించారు. ఇక సెనెట్‌లో ప్రవేశించిన తొలి స్వలింగ సంపర్కుడిగా క్రిస్ పాపస్ రికార్డు సృ ష్టించారు. న్యూ మెక్సికో గవర్నరుగా ఎన్నికైన దేవ్ హాలండ్ తొలి స్థానిక అమెరికా మహిళ (అమెరికా ఖండంలో యూరోపియన్లు అడుగు పెట్టకముందు నుంచీ...అంటే వేల ఏండ్లుగా అక్కడ నివసిస్తున్న మూలవాసులు లేదా గిరిజన తెగలకు చెందిన మహిళ)గా చరిత్ర సృ ష్టించారు.

కీలక స్థానాల్లో ఇండో - అమెరికన్ల విజయకేతనం

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు పలు కీలక స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన పలువురు ఇండో - అమెరికన్ అభ్యర్థులు ప్రతినిధిసభ స్థానాలతో పాటు రాష్ట్ర స్థాయి పదవులను కూడా కైవసం చేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాదారుగా పనిచేసిన సుహాన్ సుబ్రమణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధిసభకు తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు 61.5 శాతానికి పైగా ఓట్లు రాగా రిపబ్లికన్ ప్రత్యర్థి దేవ్ బెక్విన్‌కు 36.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒకప్పుడు హైస్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పియా దండియా ఫ్లోరిడా 23వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధిసభకు కొత్తగా ఎన్నికై రికార్డు స ష్టించారు. ఆమెకు 51.9 శాతం ఓట్లు వచ్చాయి.

డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ నేత రో ఖన్నా కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీకి చెదిన సీనియర్ నేత అమీ బెరా కాలిఫోర్నియాలోని 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. కాగా 61 సంవత్సరాల అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన పదవిని నిలబెట్టుకున్నారు. భారత సంతతికి చెందిన పూజా సేథీ టెక్సాస్ నుంచి, జ్యోతి సింగ్ జార్జియా నుంచి ప్రతినిధిసభకు ఎన్నికయ్యారు. అయితే రిపబ్లికన్ పార్టీ తరఫున ఓహియో రాష్ట్ర గవర్నర్ బరిలో నిలిచిన ప్రముఖ ఇండో`అమెరికన్ వివేక్ రామస్వామి డెమొక్రటిక్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అదే విధంగా ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డి ఓడిపోయారు. ఆమె తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ హనుమంత రెడ్డి, డాక్టర్ గీత. వారు 1980వ దశకంలోనే అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు.

బ్యాలెట్ ఓటింగ్ అయినా గంటల్లోనే ఫలితాలు !

అమెరికాలో పది కోట్ల మందికి పైగా ఓటర్లు పేపర్ బ్యాలెట్ పైనే ఓటేశారు. దానికి ముందే ప్రీ - ఓటింగ్, ఈ- మెయిల్ ద్వారా మరో ఐదున్నర కోట్ల మంది ఓటు వేశారు. అయినప్పటికీ పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ఫలితాలు వచ్చేశాయి. దీనికి కారణం ఎలక్ట్రానిక్ స్కానర్ల వినియోగమే. ప్రతి అభ్యర్థి పేరు పక్కన ఓ బాక్స్ ఉంటుంది. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన బాక్స్‌లో ఓటు వేస్తాడు. ఓటు వేసిన వెంటనే అది స్కానింగ్ యంత్రంలోకి వెళుతుంది. స్కానర్ వెంటనే ఆ ఓటును సదరు అభ్యర్థి ఖాతాకు జమ చేస్తుంది. ఓటర్లు అధిక సంఖ్యలో ఉండే పోలింగ్ స్టేషన్లలో హైస్పీడ్ మిషన్స్ ఉంటాయి. ఇవి గంటకు వేలాది ఓట్లను స్కాన్ చేసి లెక్కిస్తాయి. ఎక్కడైనా తేడా వచ్చిందని అనుకుంటే బ్యాలెట్లను మాన్యువల్‌గా లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

సోషలిస్టుల చారిత్రక విజయాలు

ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులు అద్భుత ఫలితాలు సాధించారు. ‘డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా’ (డీఎస్‌ఏ) మద్దతున్న అభ్యర్థులు పలు కీలక స్థానాల్లో గెలిచారు. హౌస్‌కు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఐదుగురు కొత్త డెమోక్రటిక్ సోషలిస్టు అభ్యర్థులు గెలిచారు. న్యూయార్క్ నుంచి క్లైర్ వాల్డెజ్, దరియాలిజా అవిలా చేవాలియర్, పెన్సిల్వేనియా నుంచి క్రిస్ రాబ్, మిచిగాన్ నుంచి డొనవాన్ మెక్కిన్నీ విజయం సాధించారు. కొలరాడోలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ డెమోక్రాట్ నేతను ఓడించిన మెలాట్ కిరోస్ విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరు ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అలెగ్జాండ్రియా ఒకేసియో-కోర్టెజ్, రషీదా త్లైబ్‌లతో కలిసి పనిచేయనున్నారు.

అలాగే, మేయర్ స్థానాల్లోనూ డెమోక్రటిక్ సోషలిస్ట్‌‌లు విజయాలు నమోదు చేశారు. వాషింగ్టన్ డిసి మేయర్‌గా డెమోక్రటిక్ సోషలిస్టు జానీస్ లూయిస్ జార్జ్ గెలిచారు. న్యూయార్క్ మేయర్ మమ్దానీ తర్వాత అమెరికాలోని ఒక ప్రధాన నగర మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సోషలిస్టు నేతగా ఆమె నిలిచారు. రోడ్ ఐలాండ్‌లోని ప్రావిడెన్స్ మేయర్‌గా డేవిడ్ మోరల్స్ విజయం సాధించారు. లాస్ ఏంజెలెస్ మేయర్ రేసులో ఉన్న సోషలిస్టు మద్దతుదారు నిత్యా రామన్ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. గృహనిర్మాణం, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకోవడం వల్లే సోషలిస్టు అభ్యర్థులకు ఓటర్లు పెద్దపీట వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.


అమెరికన్లు యుద్ధానికి ‘నో’ చెప్పారు : ఇరాన్

జీవనవ్యయం పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్న అమెరికా ప్రజలు యుద్ధానికి ‘నో’ చెప్పారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ వ్యాఖ్యానించారు. ‘అమెరికా ప్రభుత్వం తన ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అంతర్జాతీయంగా డబ్బులు ఇచ్చే వారికి, బ్లాక్‌మెయిల్ చేసే వారికి సేవలు చేస్తే ఇలాంటి పీడకలలు తప్పవు’ అని అన్నారు.


ఫలితమివ్వని ప్రకటన
ఎన్నికలకు ముందు ట్రంప్ చేసిన కీలక ప్రకటన ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మిత్రదేశమైన ఇజ్రాయిల్‌కు ఏటా ఇచ్చే నాలుగు బిలియన్ డాలర్ల సాయాన్ని ఇకపై ఆపేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే అది ఓటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అయినప్పటికీ ఇరాన్‌పై సాగించిన యుద్ధంలో తన భాగస్వామి అయిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ట్రంప్ నెరపుతున్న సంబంధాలలో దీనిని ఓ ఆసక్తికరమైన మలుపుగా చెప్పవచ్చు. ఇజ్రాయిల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకీ లేదా కూటమికీ సాధారణ మెజారిటీ రాకపోవడం కూడా ట్రంప్ ప్రకటనకు కారణమై ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


అమెరికా గెలిచింది : డెమొక్రాట్ నేతలు

ఉభయ సభల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్న డెమొక్రాట్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ‘ఎరుపు, తెలుపు, నీలం రంగుల క్షణం. ఎందుకంటే ఈ రాత్రి అమెరికా గెలిచింది’ అని ప్రతినిధిసభలో మైనారిటీ నాయకుడు హకీమ్ జెఫ్రీన్ వ్యాఖ్యానించారు. సెనెట్ స్వరూపంలో ఒక తరం మార్పు జరిగిందని ఎగువసభలో మైనారిటీ నాయకుడు చక్ షూమర్ చెప్పారు. అమెరికన్లు ఏమి కోరుకుంటున్నారో దానిపై తమ పార్టీ దృష్టి సారించిందని, ట్రంప్ ఉన్నా లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సెనెట్ డెమొక్రాట్లు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలిపారు. ఉపశమనం కలగబోతోందని వ్యాఖ్యానించారు. ఓటర్లు డెమొక్రాట్ల పైన, కార్మిక వర్గ అజెండా పైన నమ్మకం ఉంచారని స్పష్టమవుతోందని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మెన్ కెన్ మార్టిన్ చెప్పారు. ఇప్పటి వరకూ రిపబ్లికన్లు విఫలమైన రంగాలపై డెమొక్రాట్లు దృష్టి సారిస్తారని, వ్యయాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ కృ షి చేస్తారని ఆయన అన్నారు. తమ తదుపరి లక్ష్యం అధ్యక్షభవనమేనని తెలిపారు.


మస్క్‌కు షాక్ ఇచ్చిన టెక్సాస్ ఓటర్లు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ఫలితాలు షాక్ ఇచ్చాయి. డెమొక్రాట్లను లక్ష్యంగా చేసుకొని ఆయన సెటైర్లు వేశారు. స్పేస్ లేజర్లతో ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వ్యంగ్యోక్తులు విసిరారు. ముఖ్యంగా టెక్సాస్ ఫలితాలు మస్క్‌ను నివ్వెరపరిచాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన గ్రెగ్ అబట్‌కు మస్క్ ఐదు మిలియన్ డాలర్లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే టెక్సాస్ సెనెట్ సీటుకు పోటీ పడి పరాజయం పాలైన రిపబ్లికన్ అభ్యర్థికి కూడా ఆయన ఆర్థిక సాయం చేశారు. ఈ ఫలితాలపై మస్క్ వ్యాఖ్యానిస్తూ ఇక డేటా సెంటర్లను అంతరిక్షంలో పెట్టుకోవడం మంచిదని చెప్పారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతుగా మస్క్ ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా సొమ్మును వెదజల్లారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్