ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కీలక నిర్ణయం
సంక్షేమ పథకాల పురోగతిపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్టమంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో విధానపరమైన, రాజకీయ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. క్యాబినెట్ సమావేశానికి ముందుగా మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. గ్లోబల్ సమ్మిట్-2027 నిర్వహణ, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, ఉద్యోగ నియామకాలు, బడ్జెట్ కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం. క్యాబినెట్ భేటీ వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రధాన ఎజెండా ప్రతులు, చర్చించాల్సిన ముఖ్యాంశాలు, ప్రతిపాదిత బిల్లులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు.






కామెంట్లు (0)