Magazines

‌రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన

1 గంట క్రితం

Emergency-style governance in the state
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్టుకు హరీశ్‌‌రావు ఖండన

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్‌‌తోపాటు ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, బీఆర్‌ఎస్‌ ‌నేత కార్తిక్‌‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వల్ల కరువు బారిన పడిన రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మానేసి మూసీ ప్రక్షాళన పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటారా?అని ప్రశ్నించారు. కమీషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయమని విమర్శించారు.

హౌస్‌ అరెస్టుపై మాజీమంత్రి సబిత ఆగ్రహం

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా తనను, తన కుమారుడిని హౌస్ అరెస్టు చేయడం పట్ల మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోకుండా మూసీ ప్రాజెక్టుకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కరువు బారిన పడిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. కాళేశ్వరం నీటిని వినియోగించి పంటలను కాపాడాలని కోరారు. ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగించినా ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.​

ప్రజల గొంతు నొక్కడం సరికాదు : నిరంజన్‌‌రెడ్డి

ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజల గొంతు నొక్కడం సరైంది కాదని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అక్రమమని పేర్కొన్నారు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం విభజించి పాలించే సూత్రం అవలంభిస్తున్నదని తెలిపారు. ప్రజలందరితో ఒకేసారి అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్ తప్పులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్