నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడిన (2019లో విధులు నిర్వహించిన) మియాపూర్ ఎస్‌హెచ్‌ఓ ఎం.ప్రేమ్‌కుమార్‌కు హైకోర్టు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. హఫీజ్‌పేటలోని గోకుల్ ప్లాట్స్‌లో 700 చదరపు గజాల స్థలానికి రక్షణ కల్పించాలంటూ 2019లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఎ.శేఖర్‌బాబుతో పాటు మరో ఏడుగురు 2023లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ సివి.భాస్కర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ శిక్ష విధించారు. తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేస్తూ, అప్పీలు దాఖలు చేసుకుని ఉత్తర్వులు పొందాలనీ, లేనిపక్షంలో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించారు.
స్టీఫెన్‌సన్ భూమి విషయంలో ఊరట
బీఆర్‌ఎస్ మాజీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు చెందిన సికింద్రాబాద్ బోయిగూడలోని 1,936 చదరపు గజాల భూమిపై జీవో 134 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్షతో తన భూమిని నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.వి.సీతారాంమూర్తి వాదిస్తూ, ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్ ఫిర్యాదుదారుగా ఉన్నందునే ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జీవో ఆధారంగా పిటిషనర్ భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 2కు వాయిదా వేశారు.
పుల్లారెడ్డి స్వీట్స్‌లో మళ్లీ తనిఖీలు చేయండి
పుల్లారెడ్డి స్వీట్స్ సనత్‌నగర్ బ్రాంచ్‌లో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ సంస్థ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. గుర్తించిన లోపాలను సరిదిద్దామనీ, నాణ్యతలేని పదార్థాలను విక్రయించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీపావళి నేపథ్యంలో లైసెన్స్ పునరుద్ధరించాలని కోరారు. అయితే ప్రజారోగ్య దృష్ట్యా ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన లోపాలను సరిదిద్దినట్లు సంస్థ ఇచ్చిన వివరణ మేరకు తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
దత్తత బాలుడి అప్పగింతపై ప్రభుత్వ అప్పీల్
జగిత్యాలకు చెందిన కాసరపు సరిత, శ్రీనివాస్ దంపతులకు దత్తత బాలుడిని అప్పగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. 2023లో చట్టబద్ధంగా దత్తత తీసుకున్న బాలుడిని శిశు సంరక్షణ అధికారులు బలవంతంగా తీసుకెళ్లారని దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి బాలుడిని వారికి అప్పగించాలని ఆదేశించారు. దత్తత చట్టబద్ధంగా జరగలేదనీ, ధ్రువీకరణ పత్రాలు లేవని పేర్కొంటూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీలు దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుల ధర్మాసనం విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.





కామెంట్‌లు (0)