తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ.కోటి ప్రమాద బీమా : మంత్రి పొన్నం ప్రభాకర్
ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద ప్రవళిక మృతదేహానికి నివాళి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డి బుధవారం నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆర్టీసీ నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్మికుల సంక్షేమం, భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో నిందితురాలిపై గతంలో హత్యాయత్నం కేసు ఉండగా, ప్రస్తుతం హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. సంస్థలో ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి దాడులు సరికాదన్నారు. క్రమశిక్షణతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రయాణికుల ద్వారా ఏమైనా అసౌకర్యం కలిగితే కార్మికులు కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు.





కామెంట్‌లు (0)