కమ్యూనిస్టుల ప్రభావాన్ని తట్టుకోలేని పాలకులు : సీపీఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కాశిబుగ్గ
అమరవీరుల స్ఫూర్తితో కార్మిక కర్షక హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం శివనగర్ లోని రామాలయ కళ్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి సంతాప సభ నిర్వహించారు. ఈసందర్భంగా మేకల రవి చిత్రపటానికి పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రాణాలర్పించిన సీపీఐ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. వరంగల్ జిల్లాలో 40 ఏండ్ల పాటు నిస్వార్ధంగా ఒకే జెండా కింద పనిచేసిన మేకల రవి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. పేదలను సమీకరించి భూ పోరాటాలు నిర్వహించి భూ కబ్జాదారులను, అక్రమంగా పెట్టిన అనేక కేసులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సీపీఐ నాయకత్వంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి అనేక కాలనీలు నిర్మించిన పరిస్థితి ఉందన్నారు. నేడు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఉద్యమాల ప్రాధాన్యత పెరిగిందని, ప్రజలకు కమ్యూనిస్టుల పట్ల వారి పోరాటాల పట్ల అభిమానం పెరుగుతుందన్నారు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కమ్యూనిస్టుల ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఎన్నికలలో గెలుపొందిన ఎంప్లాయిస్ యూనియన్ ప్రభావాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాయకులు విజయ సారధి, షేక్ భాష్మియా, కర్రె బిక్షపతి, జ్యోతి, వెంకట్రాములు, పంజాల రమేష్, మల్లికార్జున రావు, బిక్షపతి, ప్రసాద్, లక్ష్మణ్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)