నిలిచిపోయిన సర్వీసులు...ప్రయాణికుల పడిగాపులు
సాంకేతిక లోపాన్ని తొలగించినా ఆలస్యమవుతున్న ప్రయాణాలు
వాషింగ్టన్ : అమెరికాలో విమాన సర్వీసుల రాకపోకలపై విధించిన అత్యవసర నిషేధాన్ని (గ్రౌండ్ స్టాప్) ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఎత్తివేసింది. అయితే సుమారు ఐదు గంటల పాటు విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అమెరికా విమానాశ్రయాలలో తీవ్ర రద్దీ ఏర్పడి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గగనతలాన్ని శుక్రవారం రాత్రి తిరిగి తెరిచామని రవాణా మంత్రి షాన్ డఫీ తెలిపారు. ఈ శతాబ్దంలో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను నిలిపివేయడం ఇది మూడోసారి. 2001 సెప్టెంబర్ దాడుల తర్వాత ఇదే అతి పెద్ద షట్ డౌన్.
ఏం జరిగింది ?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని పాత రూటర్లు డేటాతో ఓవర్‌లోడ్ కావడంతో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలో తప్పుడు సంకేతాలు రావడంతో భద్రతా కారణాల రీత్యా విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే ఇది సైబర్ దాడి కాదని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అంతరాయం కారణంగా శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా పదిహేను వేలకు పైగా విమాన ప్రయాణాలు ఆలస్యం కావడమో లేదా సర్వీసులు రద్దు కావడమో జరిగింది. సుమారు పదిహేను లక్షల మంది ప్రమాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో కొన్ని విమానాలు గేట్ కోసం ఐదు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చింది.
పాతపడిన సాంకేతికత, పరికరాలే కారణం
ప్రస్తుతం నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ విమానాలు, సిబ్బంది వేర్వేరు చోట్ల చిక్కుకుపోవడంతో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ఫ్లయిట్ అవేర్ డేటా ప్రకారం శనివారం కూడా మూడు వేల విమానాలు ఆలస్యం కావడమో లేదా రద్దవడమో జరిగింది. ఈ ఒత్తిడికి ప్రస్తుత వైఫల్యాన్ని అత్యంత తీవ్రమైన సంకేతంగా చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోకుండా నివారించాలంటే పాతపడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చాల్సిన అవసరం ఉన్నదని రవాణా మంత్రి డఫీ హెచ్చరించారు.






కామెంట్‌లు (0)