వారి వల్ల వ్యవస్థలు ధ్వంసం
భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం ముగిసిన ‘భారత్ సమ్మిట్-2.0’లో ఆయన ప్రసంగిస్తూ... గత పదేండ్లుగా దేశంలో ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోందని, వారి వల్ల వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘2014లో జరిగిన ఎన్నికలు గతంలో ఎప్పుడూ చూడలేదు. రూ.వందల కోట్లు ఖర్చు చేశారు. 2014 ఎన్నికల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచింది. ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ ఎన్నికల్లోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు. 3 నెలల వ్యవధిలో 70లక్షలకు పైగా ఓట్లు నమోదు చేశారు. అదనంగా చేర్చిన ఓట్ల ద్వారానే బీజేపీ గెలిచింది. వ్యవస్థలు నాశనం అవుతున్నా మనం ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకొంటున్నాం. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం కాదు. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందింది. 12 ఏండ్ల క్రితం 600వ స్థానంలో ఉన్న అదానీ, మోడీ అధికారంలోకి వచ్చాక సంపన్నుల జాబితాలో రెండో స్థానంలోకి వచ్చారు. ఏ రంగంలో చూసినా అదానీ పెట్టుబడులే కనిపిస్తాయి. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు.. ఇలా అన్నింటినీ అదానీకి అప్పగించారు. లబ్ది పొందిన వ్యాపారులు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు..’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.






కామెంట్‌లు (0)