Magazines

ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేయాలి

1 గంట క్రితం

SC categorization
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

అన్ని శాఖలు, కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు

నియామకాలు, పదోన్నతులు, విద్యా ప్రవేశాల్లో నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన చట్టం, ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజియేంద్ర బోయి అక్టోబరు 26న మెమో నంబరు 1628/ఎస్‌సీడీ (పీవోఏ.ఏ2)/2026ను జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2025 నాటి చట్టం, గతంలో జారీ చేసిన జీవోలు, మార్గదర్శకాల అమలులో కొన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్ల మధ్య స్పష్టత లోపించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి ఏకరూపంలో అమలు ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై కొన్ని ఎస్సీ సంఘాలు, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 2025 నవంబరు 25న జారీ చేసిన మెమో నంబరు 1762/ఎస్‌సీడీ/పీవోఏ.ఏ2/2025లో పేర్కొన్న మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులతో పాటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలు ఎలాంటి మినహాయింపులు లేకుండా ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కార్యదర్శి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థకు చెందిన అధికారులు, రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లకు ఈ ఉత్తర్వులను పంపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత మంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలకు కూడా ప్రతులు పంపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్