2022లోనే కేంద్ర జలజీవన్ మిషన్ జీవో ఇచ్చింది
బీఆర్ ఎస్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారు
299 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ సంతకం చేసింది కేసీఆరే :సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు కారణమైన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని కేసీఆర్, జగన్ హయాంలోనే చేపట్టారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ 2022లోనే రూ.1,580 కోట్లకు జీవో ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులను చేపట్టారని తెలిపారు. కేసీఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడును ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన 299 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలించుకుపోయేలా సంబంధిత పత్రాలపై సంతకాలు చేసిందని కేసీఆరేనని దుయ్యబట్టారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల భూ సేకరణకు బీఆర్ ఎస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని విమర్శించారు.
సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి...
రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షను, నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సీఎం ఈ సందర్భంగా నేతలకు సూచించారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత ఐదు నెలలపాటు ప్రజా బలం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లాలని కోరారు. రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంఛార్జి సందీప్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని కోరారు. మీనాక్షి నటరాజన్ ఇంఛార్జిగా ఉన్న సమయంలో ఉపఎన్నిక లు,పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. వందేండ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా ఓబీసీ కులగణనను చేపట్టామని వివరించారు. 2027 లో కేంద్రం చేపట్టే జనగణన లో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పార్టీ తరపున తీర్మానించి, కేంద్రానికి పంపాలని, ప్రధానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్‌ను కోరారు.
ఆహార ధాన్యాలకు కొరత లేదు...
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార ధాన్యాల కి కొరత లేదని చెప్పారు. వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా రైతులకు అందించ గలిగామని వివరించారు. తద్వారా పంటలు ఎండి పోకుండా కాపాడగలిగామని తెలిపారు. ఎల్‌నినో వల్ల వంద దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, పొరుగున ఉన్న మహారాష్ట్ర,కర్ణాటకలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. వచ్చే 8 నెలలు తాగునీటిని అందించాల్సి ఉందని, ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అందుకోసం వినియోగిస్తామని తెలిపారు. ఎల్‌నినోను ఎదుర్కోవటానికి రూ.30 వేల కోట్లు అవసరమని, ఆ మేరకు కేంద్రం సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ పని కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం త్వరలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని వెల్లడించారు.
సర్.. తస్మాత్ జాగ్రత్త...
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. గతంలో ఓటు హక్కును కల్పించేందుకు సర్ ప్రక్రియను ఉపయోగిస్తే, మోడీ అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించేందుకే సర్‌ను వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. 2019 లో దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 91 కోట్ల ఓట్లున్నాయని గుర్తు చేశారు. 2024 లో 140 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 97.5 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. అయితే సర్ పేరిట మోడీ సర్కార్ ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించిందని చెప్పారు. తొలగించిన ఓట్లలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. వలసలు పోవడం వల్ల వీరి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. వీరందరూ మొదటి నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో సైతం 71 లక్షల ఓట్ల ను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల కాంగ్రెస్‌కు చెందిన బీ.ఎల్.వోలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంటి పేరు సరిగా లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారని, యాంత్రికంగా ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలను బీజేపీ ఓటు హక్కు ఉన్నవాళ్లు, ఓటు హక్కు లేని అనే రెండు తరగతులుగా బీజేపీ విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఎన్నికల వరకు వేచి చూడకుండా తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చేలా చూడాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)