Magazines

రైతుగర్జన స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలి

20 నిమిషాల క్రితం

We must work with enthusiasm, inspired by the 'Rythu Garjana' (Farmers' Roar).
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

ఆదిలాబాద్‌ జిల్లా నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్‌ అభినందన

నవతెలంగాణ బ్యూరో - హై‌దరాబాద్‌

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమ జయప్రదానికి కృషి చేసిన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు రామన్న, భార్గవ్ దేశ్‌పాండే, యువ నాయకుడు జోగు మహేందర్‌తోపాటు పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ చేపట్టిన పోరాటానికి రైతుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. రైతు గర్జన విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు వంటి పథకాలతో రైతాంగానికి భరోసా కల్పించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా అమల్లో జాప్యం, రైతులకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం కారణంగా అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు గర్జన విజయంతో ఆగిపోకుండా, అదే స్ఫూర్తితో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలనీ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్