మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు వీడాలి
నల్లగొండలో జరిగే ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపు
సూర్యాపేటలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
నవతెలంగాణ-సూర్యాపేట
దేశానికి అన్నం పెట్టే రైతాంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే శ్రమజీవులు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈ క్రమంలో పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం కోసం బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆధ్వర్యంలో 36 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వ హించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశవ్యా ప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిల భారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంఘంగా కొనసాగు తోందన్నారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర-వయలార్, సుర్మా లోయ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అమలవుతున్న ఆర్థిక విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను విడనాడాలని, రైతాంగ సమస్యల పరిష్కారానికి సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ మహాసభ నేపథ్యంలో ఈ నెల 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ పరిస్థితులను ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
ఈ మహాసభ రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనుందని చెప్పారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా నాయకులు దండ వెంకటరెడ్డి, కొప్పుల రజిత, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, మేకనబోయిన శేఖర్, ప్రజాసంఘాల జిల్లా నాయకులు వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, వీరబోయిన రవి, వల్లపుదాసు సాయికుమార్, మామిడి సుందరయ్య, నారాయణ వీరారెడ్డి, సుందరి వీర రాఘవయ్య, మద్దెల జ్యోతి, మేకనబోయిన సైదమ్మ, సుందరి రమాదేవి, మూల విజయరెడ్డి పాల్గొన్నారు.






కామెంట్లు (0)