నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తాను సీఎం అయిన తర్వాత తనను స్టింగ్ ఆపరేషన్‌లో ఇరికించేందుకు ప్రయత్నం జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు.
ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తులు తనను కలిశారని చెప్పారు. వారెవరో, ఎవరి కోసం వచ్చారో తనకు తెలుసన్నారు. ‘‘నన్ను ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. నా వద్ద ఫొటోలు ఉన్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు శివకుమార్ వెల్లడించారు. తనను కలిసిన వ్యక్తులకు సంబంధించిన పత్రాలను భద్రపరిచినట్లు చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు బయటపెట్టలేనన్నారు.
‘‘వాళ్లు ఏం మాట్లాడేందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరిని కలిశారు? అన్నీ నాకు తెలుసు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసు’’ అని శివకుమార్ అన్నారు.
ప్రభుత్వ అధికారులను కూడా ఇలాంటి ఉచ్చుల్లోకి లాగవచ్చని హెచ్చరించిన ఆయన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. తన చుట్టూ మూడు స్థాయుల్లో వ్యక్తులు ఉంటారని, కొందరిని ప్రత్యేకంగా నియమించినట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు.
తనపైనే కాకుండా మరికొందరిపైనా స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని శివకుమార్ ఆరోపించారు. వాటి వెనుక ఎవరు ఉన్నారు? వాటికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? అన్న సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
నన్ను స్టింగ్ ఆపరేషన్‌తో ఇరికించే ప్రయత్నం..సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)