Magazines

ఢిల్లీలో ఆంక్ష‍లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీపీఐ(ఎం) పిటిషన్‌

13 గంటల క్రితం

court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అక్టోబర్‌ 10 నిరసనను అడ్డుకునేందుకు ఢిల్లీలో విధించిన తీవ్రమైన ఆంక్ష‍లను సవాలు చేస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి వచ్చే రైలు సర్వీసుల రద్దుచేయడంతో పాటు 57 మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ నిలిపివేత వంటి ఆంక్షలు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఎంఏ బేబి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అక్టోబర్ 10న సీఈసీకి వ్యతిరేకంగా జరగనున్న నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో రైళ్లు, మెట్రో సేవలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజే విచారణ జరపాలని కోరుతూ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ భారత ప్రధాన న్యాయమూర్తి ముందు అత్యవసరంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.


దేశ రాజధానిని పూర్తిగా లాక్‌డౌన్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందని అన్నారు. ‘‘నా దేశానికి ఏమైపోతోంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. నిరసన తెలపడం ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అనుమతి లేని నిరసనలను చట్టవిరుద్ధంగా పరిగణించాల్సి వస్తుందని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసనకారులు ఎందుకు సవాలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు న్యాయవాదులను ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్