గల్ఫ్ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి
క్యూబాపై బెదిరింపులు, ఆంక్షలు ఎత్తివేయాలి
ఐరాస వేదికగా అమెరికా వైఖరిపై చైనా పరోక్ష విమర్శలు
బీజింగ్ వైఖరికి మాస్కో మద్దతు
న్యూయార్క్ : ఇరాన్, క్యూబా అంశాల్లో అమెరికా విధానాలను చైనా ఐక్యరాజ్యసమితి వేదికగా పరోక్షంగా ప్రశ్నించింది. గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, భద్రతను గౌరవించాలని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ పిలుపునిచ్చారు. క్యూబాపై బలప్రయోగం చేస్తామనే బెదిరింపులను ఆపడంతో పాటు, ఆ దేశంపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. అయితే హాన్ తన ప్రసంగంలో అమెరికా పేరును నేరుగా ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు చేశారు. ప్రపంచ శాంతి, భద్రత విషయంలో పెద్ద దేశాలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని హాన్ అన్నారు. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను పాటించడంలో పెద్ద దేశాలే ముందుండాలని వివరించారు. మధ్యప్రాచ్యంలోని, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వం, భద్రతను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఇరాన్‌కు చైనా మద్దతు ఇవ్వకూడదని అమెరికా కోరినట్టు అమెరికా రాయబారి తెలిపిన విషయం విదితమే.
చైనా వైఖరికి రష్యా మద్దతు
చైనా వ్యాఖ్యలకు కొద్ది గంటల తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా మద్దతు తెలిపారు. క్యూబాపై అమెరికా ఆంక్షలు, వాణిజ్య పరిమితులు ఎత్తివేయాలని ఆయన కోరారు. క్యూబాను ‘ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల’ జాబితా నుంచి తొలగించాలని కూడా అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో అన్ని దేశాలకూ సమాన ప్రాధాన్యం ఉండాలని హాన్ జెంగ్ అన్నారు. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా అంతర్జాతీయ సమాజంలో సమాన సభ్యుడేనని స్పష్టం చేశారు. ప్రపంచ సమస్యలను అన్ని దేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా అభిప్రాయపడుతోందని చెప్పారు.
షీ జిన్‌పింగ్–ట్రంప్ మధ్య వాషింగ్టన్‌లో సానుకూల వాతావరణం కనిపించిన కొద్ది రోజులకే ఐరాసలో చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాల్లో అమెరికాతో చర్చలు కొనసాగిస్తూనే.. ఇరాన్, క్యూబా వంటి అంతర్జాతీయ అంశాల్లో తన స్వతంత్ర విదేశాంగ వైఖరిని చైనా కొనసాగిస్తున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయాలి
క్యూబా విషయంలో చైనా మరింత స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసింది. క్యూబాపై బలప్రయోగం చేస్తామనే బెదిరింపులను వెంటనే ఆపాలనీ, ఆ దేశంపై ఉన్న దిగ్బంధం, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని హాన్ కోరారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో క్యూబాలో ఇంధన కొరత, విద్యుత్ సంక్షోభం తీవ్రమైన విషయం విదితమే. ఈ నెలలో క్యూబా విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడంతో లక్షలాది మంది ప్రజలు విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంధన కొరత, పాతబడిన విద్యుత్ వ్యవస్థతో పాటు అమెరికా ఆంక్షలు పరిస్థితిని మరింత కష్టతరం చేశాయని క్యూబా ప్రభుత్వం పేర్కొంటోంది.
ఇరాన్, క్యూబాకు చైనా మద్దతు
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)