జాతి పునరుజ్జీవనాన్ని ఎవరూ అడ్డుకోలేరు
నూతన చైనా అసాధారణ
విజయాలు మాకు గర్వకారణం
వేర్పాటువాద శక్తులతో దృఢంగా పోరాడాలి:
77వ వార్షికోత్సవ కార్యక్రమంలో జిన్‌పింగ్
బీజింగ్ : ఎన్ని ఒత్తిడులు ఎదురవు తున్నప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ కుంగిపోకుండా ఓరిమితో స్థిరంగా నిలబడిందని, కీర్తి ప్రతిష్టలు సంపాదించిందని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. ఈ సంవత్సరానికి నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 77వ వార్షికోత్సవం సందర్భంగా బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడుల మధ్య ముందుకు సాగుతోందని, అత్యున్నత నాణ్యతతో కూడిన అభివృద్ధి వైపు పయనిస్తోందని తెలిపారు.
అక్టోబర్ 1వ తేదీని చైనా జాతీయ దినోత్సవంగా పాటిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దేశం దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, గొప్ప జాతీయ పునరుజ్జీవనాన్ని సాధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిన్‌పింగ్ తన ప్రసంగంలో చెప్పారు.
చైనా జాతి యొక్క పునరుజ్జీవనాన్ని ఎవరూ అడ్డుకోలేరని జిన్‌పింగ్ అన్నారు. 'మనం ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలపై దృష్టి సారించి అంచెలంచెలుగా స్థిరంగా ముందుకు సాగినంత కాలం విజయం అంతిమంగా సీపీసీని, చైనా ప్రజలను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను వరిస్తుంది' అని ఆయన చెప్పారు.
ఈ ఊపును కొనసాగిం చడానికి, నూతన ఆవిష్కరణలతో కూడిన, నాణ్యమైన, పటిష్టమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవనోపాధిని పరిరక్షిం చడానికి, దానిని మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ చర్యల ద్వారా పదిహేనవ పంచవర్ష ప్రణాళికకు మంచి ఆరంభం లభిస్తుందని చెప్పారు. గత 77 సంవత్సరాలుగా వేగవంతమైన ఆర్థిక వృద్ధి, శాశ్వత సామాజిక స్థిరత్వం అనే రెండు అద్భుతాలను సాధించడంలో చైనా ప్రజలకు పార్టీ నాయకత్వం వహించిందని అన్నారు. 'నూతన చైనా సాధించిన అసాధారణ విజయాలు మాకు అపారమైన గర్వకారణంగా ఉన్నాయి. చైనా ఆధునీకరణ యొక్క ఉజ్వల భవిష్యత్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. తైవాన్ జలసంధి అంతటా సహకారాన్ని మరింత పెంచడానికి కృషి చేయాల్సి ఉంది. అదే సమయంలో తైవాన్ స్వాతంత్య్రాన్ని కోరుకునే వేర్పాటువాద శక్తులతో దృఢంగా పోరాడాలి. ఇతరుల జోక్యాన్ని వ్యతిరేకించాలి' అని జిన్‌పింగ్ చెప్పారు. స్వతంత్ర శాంతియుత విదేశాంగ విధానానికి చైనా కట్టుబడి ఉన్నదని, తాను ప్రతిపాదించిన నాలుగు ప్రధాన ప్రపంచ కార్య క్రమాలను అది ముందుకు తీసుకొని పోతుందని, అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచానికి శాంతిని, సానుకూల శక్తిని అందించడానికి మానవాళి కోసం సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఒకే దేశం... రెండు వ్యవస్థలు అనే విధానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. దేశ సమగ్రాభివృద్ధిలో హాంగ్‌కాంగ్, మకావ్‌లు మరింత భాగస్వాములయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని జిన్‌పింగ్ తెలిపారు.
లావోస్‌లో వైమానిక శిక్షణ కేంద్రం
చైనా లావోస్‌లో ఒక వైమానిక దళ సహాయ, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది చైనాకు మూడవ విదేశీ సైనిక స్థావరం. లావోస్‌లోని వియాంటియాన్ రాష్ట్రంలో ఉన్న బాన్‌కూన్ విమానాశ్రయంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది చైనా-లావోస్ సంయుక్త కేంద్రం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లావోస్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి ఔతకారుసోన్‌తో పాటు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌పీ) ప్రతినిధులు హాజరయ్యారు. కాంబోడియాలో చైనాకు ఇదే తరహా సైనిక స్థావరం ఉంది. చైనా తన మొట్టమొదటి విదేశీ నౌకా స్థావరాన్ని ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న జిబౌటిలో ఏర్పాటు చేసింది.






కామెంట్‌లు (0)