Magazines

అట్లాంటా జూకు చైనా నుంచి రెండు పాండాలు

1 గంట క్రితం

Two pandas from China to Atlanta Zoo
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

అమెరికా–చైనా బంధంలో
‘పాండా దౌత్యం’ మరో అడుగు
15 గంటల విమాన ప్రయాణం..
నెల రోజుల క్వారంటైన్‌ తర్వాత
సందర్శకుల ముందుకు పింగ్‌ పింగ్‌, ఫు షువాంగ్‌లకు ఘన స్వాగతం

అట్లాంటా : అమెరికా–చైనా మధ్య వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో పోటీ కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలిచిన ‘పాండా దౌత్యం’ మరోసారి వార్తల్లోకెక్కింది. చైనా ప్రభుత్వం రుణ ప్రాతిపదికన పంపిన రెండు పెద్ద పాండాలు ఆదివారం అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయానికి చేరుకున్నాయి. చైనాలోని చెంగ్డూ నుంచి సుమారు 15 గంటల విమాన ప్రయాణం చేసిన పింగ్‌ పింగ్‌, ఫు షువాంగ్‌లను హార్ట్స్‌ఫీల్డ్‌–జాక్సన్‌ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూ అట్లాంటాకు తరలించారు. చెంగ్డూలోని జెయింట్‌ పాండా బ్రీడింగ్‌ రీసెర్చ్‌ బేస్‌ నుంచి ఈ పాండాలను ప్రత్యేక పెట్టెల్లో విమానంలోకి తరలించారు. వాటి ప్రయాణ సమయంలో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అట్లాంటా చేరుకున్న తర్వాత కూడా చైనా నుంచి వచ్చిన పశువైద్యులు, పాండాల సంరక్షణ నిపుణులు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు.

పాండాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

పాండాల రాకకు ముందు ఏడాది కాలంగా జూ అట్లాంటాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వాటి నివాస ప్రాంతాలను మరింత విస్తరించారు. తగినంత వెదురు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పాండాల సంరక్షణలో అనుభవం ఉన్న సిబ్బందిని సిద్ధం చేశారు. అట్లాంటాకు పంపే ముందు పింగ్‌ పింగ్‌, ఫు షువాంగ్‌లను నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. సుదీర్ఘ విమాన ప్రయాణానికి అలవాటు పడేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వాటి ప్రయాణ పెట్టెలు, పెద్ద శబ్దాలకు ముందుగానే అలవాటు చేశారు.

2020లో జననం

మగ పాండా పింగ్‌ పింగ్‌ 2020 మార్చి 17న జన్మించింది. ‘పింగ్‌ పింగ్‌’ అంటే శాంతి అని అర్థం. చెట్లను ఎక్కడంలో ఇది నైపుణ్యం కలిగినదని చైనా అధికారులు తెలిపారు. ఆడ పాండా ఫు షువాంగ్‌ 2020 అక్టోబర్‌ 18న జన్మించింది. ‘ఫు షువాంగ్‌’ అంటే ‘రెట్టింపు ఆశీర్వాదాలు’. దీనికి తేనె అంటే చాలా ఇష్టమని సంరక్షకులు చెబుతున్నారు. వాటి వయసు, ఆరోగ్యం, జన్యు లక్షణాలు, స్వభావాన్ని పరిశీలించిన తర్వాతే ఈ జంటను ఎంపిక చేశారు. భవిష్యత్తులో సహజసిద్ధంగా సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండేలా వాటిని ఎంపిక చేసినట్టు చెంగ్డూ పాండా కేంద్రం అధికారులు తెలిపారు. తాజా పాండాల రాకకు మరో ప్రత్యేకత ఉంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన ముగిసిన మరుసటి రోజే ఇవి అమెరికాకు బయలుదేరాయి. ఆ పర్యటనలో అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన హాట్‌లైన్‌ ఏర్పాటుపై ఇరు దేశాలు అంగీకరించినట్టు సీఎన్ఎన్‌ తెలిపింది. చెంగ్డూ ప్రపంచంలోనే అతిపెద్ద పాండా పెంపక కేంద్రాల్లో ఒకటిగా ఉంది. అక్కడ 240కి పైగా పాండాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బందీగా ఉన్న పాండాల్లో దాదాపు మూడో వంతు అక్కడే ఉన్నాయి.

ఐదు దశాబ్దాల ‘పాండా దౌత్యం’
చైనా దశాబ్దాలుగా జెయింట్‌ (పెద్ద) పాండాలను ఇతర దేశాలకు పంపుతూ దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తోంది. దీనినే ‘పాండా దౌత్యం’గా పిలుస్తారు. 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ చైనాను సందర్శించిన తర్వాత అమెరికాకు పాండాలను పంపే సంప్రదాయం ప్రారంభమైంది. 2024లో అట్లాంటా జూ నుంచి నాలుగు పాండాలను తిరిగి చైనాకు పంపడంతో అక్కడ 25 ఏండ్ల పాండా ఒప్పందం ముగిసింది. అనంతరం 2024లోనే శాన్‌ డియాగో, వాషింగ్టన్‌ జాతీయ జూకు కొత్త పాండాలు చేరాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్