హైదరాబాద్ షూటర్ సిల్వర్ షో
జావెలిన్‌లో డబుల్ ధమాకా
ఆసియా క్రీడలు 2026
ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ అదరగొట్టింది. ప్రపంచ నం.1 ఇషా సింగ్ మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. పసిడి పతకం కోసం చైనా షూటర్‌తో షూటౌట్ వరకు పోరాడిన ఇషా సింగ్ సిల్వర్‌తో సరిపెట్టుకుంది. జట్టు విభాగంలో ఇషా సింగ్, మను భాకర్ మెరిసినా రాహి ఓ షాట్‌ను మిస్ చేయటంతో భారత్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయింది.
నగోయా (జపాన్) :
హైదరాబాదీ అమ్మాయి, భారత స్టార్ షూటర్ ఇషా సింగ్ ఆసియా క్రీడల్లో మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. ఈ విభాగంలో వరల్డ్ నం.1గా కొనసాగుతున్న ఇషా సింగ్ అర్హత రౌండ్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచినా.. పతక పోరులో గురి తప్పలేదు. తొలుత దక్షిణ కొరియా షూటర్‌తో షూటౌట్‌లో మెరిసిన ఇషా సింగ్, ఆ తర్వాత పసిడి వేటలో చైనా షూటర్ షియావోతో అమీతుమీ పోరాడింది. ఇషా సింగ్, షియావోలు 38 పాయింట్లతో సమంగా నిలువటంతో పసిడి పతక విజేతను తేల్చేందుకు ఆరు రౌండ్ల షూటౌట్ అవసరమైంది. తొలి ఐదు రౌండ్లలో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలువగా ఆరో రౌండ్‌లో ఇషా సింగ్ వెనుకంజ వేసింది. ఇదే విభాగంలో పోటీపడిన స్టార్ షూటర్ మను భాకర్ అర్హత రౌండ్‌లో 579 పాయింట్లతో (ఇషా సింగ్ 580) పతక పోరుకు అర్హత సాధించలేదు. ఇక మహిళల 25 మీటర్ల పిస్టల్ జట్టు విభాగంలో మను భాకర్, రాహితో కలిసి ఇషా సింగ్ పతక ప్రదర్శన చేసినా.. రాహి ఓ రౌండ్‌లో పూర్తిగా షాట్ మిస్ చేయటంతో భారత్ పతకం చేజార్చుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన ఇషా సింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ అభినందనలు తెలిపారు.
జావెలిన్‌తో త్రోలో డబుల్ ధమాకా
జావెలిన్ త్రోలో సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా లేకపోయినా.. మనోళ్లు ఈ విభాగంలో ఏకంగా రెండు పతకాలు సాధించారు. యశ్‌వీర్ సింగ్ జావెలిన్‌ను 85.77 మీటర్ల విసిరి రెండో స్థానంలో నిలువగా, రోహిత్ యాదవ్ బల్లెంను 84.35 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక అథ్లెట్ రుమేశ్ 88.55 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించాడు. యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. ఒలింపిక్ చాంపియన్, పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 80.29 మీటర్ల త్రోతో నాల్గో స్థానానికి పరిమితం అయ్యాడు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ సిల్వర్ మెడల్ సాధించాడు. నాల్గో ప్రయత్నంలో ఫౌల్ చేసిన శ్రీ శంకర్ ఆ తర్వాత మళ్లీ జంప్‌కు రాలేదు. కానీ అంతకుముందే, 8.07 మీటర్ల జంప్‌తో సిల్వర్ ఖాయం చేసుకున్నాడు. చైనా అథ్లెట్ షి యుహావో 8.17 మీటర్లతో పసిడి, ఉబ్బెకిస్తాన్ అథ్లెట్ అన్వర్ 8.06 మీటర్లతో కాంస్యం సాధించారు. పురుషుల 1500 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. 3.36.72 సెకండ్లలో రేసును ముగించిన గుల్వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ సొంతం చేసుకున్నాడు. జపాన్ అథ్లెట్ కజుటో 3.36.35 సెకండ్లలో రేసు ముగించి స్వర్ణం సాధించగా, జపాన్‌కే చెందిన మరో అథ్లెట్ నగియ 3.37.92 సెకండ్లతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో విథ్య రామరాజ్ కాంస్య పతకం సాధించింది. 54.75 సెకండ్లలో రేసు ముగించిన విథ్య మూడో స్థానంలో నిలిచింది. 400మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో అను రాఘవన్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి రెండో మెడల్ సొంతం చేసుకుంది. 5000 మీటర్ల రేసును 15 నిమిషాల 14.61 సెకండ్లలో ముగించిన పారుల్ చౌదరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. 3000మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ చౌదరి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఖురాశ్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. మహిళల 78 కేజీల విభాగం సెమీఫైనల్లో పింకీ బల్హరా 0-5తో దక్షిణ కొరియా అమ్మాయి సుమిన్ చేతిలో ఓటమి చెందింది. సెమీస్‌లో ఓటమితో పింకీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
సెమీస్‌లో భారత్
ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం క్వార్టర్‌ఫైనల్లో భారత్, అఫ్గనిస్తాన్ తలపడాల్సి ఉండగా.. ఎడతెగని వర్షం, తడి అవుట్ ఫీల్డ్‌తో ఆట సాధ్య పడలేదు. మెరుగైన సీడ్ జట్టుగా బారత్ నేరుగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది.







కామెంట్‌లు (0)