సెయిలింగ్‌లోనూ సిల్వర్ షో
ఆసియా క్రీడలు 2026
నగోయా (జపాన్)
ఆసియా క్రీడల్లో భారత పతక జోరు కొనసాగుతోంది. రెజ్లింగ్ గ్రీకో రోమన్ విభాగంలో భారత్ పతక వేట మొదలుపెట్టింది. ఆసియా క్రీడల్లో భారత్ రెజ్లింగ్ పతకాలు సాధించినా, గ్రీకో రోమన్ విభాగంలో 64 ఏండ్లుగా ఓ మెడల్ లేదు. పురుషుల 97+ కేజీల విభాగంలో నితేశ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. గురువారం జరిగిన ఫైనల్లో జపాన్ రెజ్లర్ యూరి నకజటో చేతిలో 0-4తో నితేశ్ నిరాశపరిచాడు. పసిడి పోరులో ఓడినా.. రజత పట్టుతో మెరిశాడు. 1962 జకర్తా ఆసియా క్రీడల తర్వాత భారత్ తొలిసారి గ్రీకో రోమన్‌లో ఓ మెడల్ సాధించింది. సెయిలింగ్‌లోనూ భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. పురుషుల స్కఫ్ ఈవెంట్‌లో భారత సెయిలర్లు మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబెల్ రజత ప్రదర్శన కనబరిచారు. 9 రేసుల తర్వాత భారత సెయిలింగ్ జోడీ రెండో స్థానంలో నిలువగా.. చైనా సెయిలర్లు అగ్రస్థానంలో, హాంగ్‌కాంగ్ సెయిలర్లు తృతీయ స్థానంలో నిలిచారు. మను, ప్రిన్స్ జోడీ రెగట్టాలో 23 పాయింట్లు సాధించగా, చైనా జోడీ 24 పాయింట్లతో ముందంజ వేసింది. ఈ ఆసియా క్రీడల్లో సెయిలింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. స్క్వాష్ జట్టు విభాగంలో భారత్ కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. మహిళల జట్టు సెమీఫైనల్లో హాంగ్‌కాంగ్ చేతిలో పరాజయం పాలైంది. 2-1తో భారత్‌పై పైచేయి సాధించిన హాంగ్‌కాంగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఓటమితో భారత మహిళల జట్టు కాంస్యం దక్కించుకుంది. పురుషుల జట్టు సైతం సెమీఫైనల్లో నిరాశపరిచింది. మలేషియా చేతిలో 1-2తో ఓటమి చెందిన మెన్స్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. సెయిలింగ్ మహిళల స్కిఫ్ విభాగంలో హర్షిత తోముర్, శితల్ వర్మ జోడీ కాంస్య పతకం గెల్చుకున్నారు.
గణేశ్‌కు కాంస్యం
ఆర్చరీలో పసిడి మోత మోగించిన భారత్.. వ్యక్తిగత విభాగాల్లో ఆ జోరు చూపించలేదు. మహిళల కాంపౌడ్ క్వార్టర్‌ఫైనల్లో తెలంగాణ అమ్మాయి చికిత నిరాశపరిచింది. పతకంపై కన్నేసిన చికిత 143-144తో ఇండోనేషియా ఆర్చర్‌కు సెమీఫైనల్ బెర్త్ కోల్పోయింది. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ రత్నం కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో వియత్నాం ఆర్చర్‌పై 149-144తో గణేశ్ గెలుపొందాడు.

ఫైనల్లో భారత్
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ 124 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (80 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (38) మినహా బ్యాటింగ్ లైనప్‌లో అభిషేక్ శర్మ (7), సంజు శాంసన్ (7), శ్రేయస్ అయ్యర్ (13), అక్షర్ పటేల్ (8), తిలక్ వర్మ (2), శివమ్ దూబె (3) నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ అర్థ సెంచరీతో భారత్ మంచి స్కోరు చేసింది. బౌలర్లు బుమ్రా (2/7), అభిషేక్ శర్మ (2/2), అక్షర్ పటేల్ (2/8) రాణించటంతో శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. ఏకపక్ష విజయంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. వర్షం ప్రభావిత మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 111/7 పరుగులు చేయగా, పాకిస్తాన్ 11.3 ఓవర్లలోనే 112/4 పరుగులు చేసింది. శనివారం పసిడి పోరులో భారత్, పాకిస్తాన్ తలపడనుండగా.. కాంస్య పతకం కోసం బంగ్లాదేశ్, శ్రీలంక పోటీపడనున్నాయి. ఇదిలా ఉండగా, పురుషుల హాకీలోనూ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 4-3తో గెలుపొంది పసిడి పోరుకు చేరుకుంది. సెపక్‌తక్రాలో వియత్నాంపై 2-0తో, మయన్మార్‌పై 2-1తో గెలుపొందిన భారత్ సెమీఫైనల్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకుంది.






కామెంట్‌లు (0)