Magazines

పండుగకు ముందు షాక్

43 నిమిషాల క్రితం

A shock before the festival
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ధరల పెంపు
ఏసీలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు ప్రియం..
న్యూఢిల్లీ : దీపావళి పండగకు ముందే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయని సంకేతాలు వస్తోన్నాయి. ఇప్పటికే ఎల్‌‌జీ, బ్లూ స్టార్, గోద్రెజ్, హయ్యర్, డైకిన్ తదితర సంస్థలు ధరల పెంపుదలను ప్రకటించగా.. మరిన్ని కంపెనీలు అదే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ఎయిర్‌ కండిషనర్లు (ఏసీ), టెలివిజన్లు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు సహా కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ ధరలు అక్టోబర్‌ 1 నుంచి మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఏసీల ధరలు 5 నుంచి 8 శాతం, టివిలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగనున్నాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషించింది. ఈ ఏడాదిలో కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ ధరలు పెరగడం ఇది మూడోసారి కానుంది. జనవరి–ఫిబ్రవరిలో, మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్‌ ప్రారంభంలో ఇప్పటికే రెండుసార్లు ధరలు పెరిగాయి. మరోవైపు 2026లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సగటు రిటైల్‌ ధరలు 21 శాతం ఎగిశాయి.
స్మార్ట్‌ఫోన్లపై మెమరీ చిప్స్ ప్రభావం..
స్మార్ట్‌ఫోన్ల ధరలు ముఖ్యంగా మెమరీ, స్టోరేజ్ చిప్‌లు, ప్రాసెసర్లు, డిస్‌ప్లే ప్యానెల్స్ వంటి గ్లోబల్ సరఫరా చెయిన్‌‌పై ఆధారపడి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణ కారణంగా ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లు భారీగా మెమరీని వినియోగిస్తున్నాయి. దీంతో వినియోగదారుల ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులకు అందాల్సిన చిప్స్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి కొరత ఏర్పడింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 15 శాతం పెరగగా..
భారతదేశంలో మాత్రం ఇది 21 శాతంగా ఉండటం మరింత ఆందోళకరం. ఎల్‌‌జీ ఏసీ ధరలు ఏడు శాతం పెంపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌‌జీ తన ఏసీ ధరలను 5 నుంచి 7 శాతం వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటికే బ్లూ స్టార్, గోద్రెజ్, హయ్యర్, డైకిన్ వంటి పలు కంపెనీలు కూడా వివిధ కేటగిరీలలో 4 నుంచి 10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.

ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుదల...
ఉత్పత్తి వ్యయాలు పెరగడమే తాజా ధరల పెంపునకు ప్రధాన కారణంగా మారింది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ కమాడిటీ ధరలు, రవాణా వ్యయాలు, రూపాయి మారకం విలువలో మార్పులు తయారీదారులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎసిల తయారీలో కీలకమైన రాగి ధర గతేడాది టన్నుకు 8,000–9,000 డాలర్ల నుంచి ప్రస్తుతం 14,500 డాలర్లకు చేరింది. ఒక ఏసీ యూనిట్‌లో సాధారణంగా 3–4 కిలోల రాగి వినియోగిస్తారు. 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్‌ మధ్య అల్యూమినియం, రాగి, టిన్‌ ధరలు దాదాపు మూడో వంతు పెరిగాయి. గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ ప్రకారం ఇదివరకు ధరల సవరణతో పోలిస్తే కమాడిటీ ధరలు 8–10 శాతం పెరిగాయి. దీనికి తోడు డాలర్‌తో రూపాయి విలువ ఈ ఏడాది సుమారు 6.6 శాతం క్షీణించింది. దీంతో దిగుమతి ఆధారిత విడిభాగాల వ్యయం పెరిగింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారత్ తన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ అవసరాలలో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. మరోవైపు రవాణా వ్యయం కూడా రెట్టింపు అయింది. ఆగ్నేయాసియాలో తుఫానులు, ఎర్రసముద్ర మార్గంలో షిప్పింగ్ సమస్యల కారణంగా చైనా, తైవాన్‌ల నుంచి విడిభాగాల రవాణా ఆలస్యం కావడంతో పాటు షిప్పింగ్, ఇన్సూరెన్స్, ఇంధన ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్