- రాయపోల్ మండల అభివృద్ధిలో చెరగని ముద్ర
నవతెలంగాణ - రాయపోల్
రాయపోల్ మండల ఎంపీఓ, ఎంపీడీవోగా సుమారు ఏడేళ్లపాటు విధులు నిర్వహించి బదిలీపై మద్దూరు మండలానికి వెళ్లిన డా. చిలుముల శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని పలువురు సర్పంచులు, అధికారులు కొనియాడారు. మండల అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.ఈ సందర్భంగా రాయపోల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని డా. చిలుముల శ్రీనివాస్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో ఆత్మీయ సంబంధాలను పెంచుకున్న శ్రీనివాస్ బదిలీ కావడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు అందరితో కలుపుగోలుగా మెలిగిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
మండల అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రీనివాస్ చూపిన చొరవ, అధికారులు,ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం సాధించిన తీరు రాయపోల్ మండల ప్రజలకు గుర్తుండిపోతుందని పలువురు అన్నారు. పదవి మారినా ఆయనతో ఏర్పడిన ఆత్మీయ అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం మద్దూరు మండలానికి బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ఎంపీడీవోకు స్వాగతం: రాయపోల్ మండలానికి నూతనంగా ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కె. నరేందర్ రెడ్డిని ఈ సందర్భంగా సర్పంచులు, అధికారులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తానని నూతన ఎంపీడీవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలీఫ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మున్నా, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)