ఓటర్ల జాబితా మార్పులపై ఈసీలోనే భిన్నాభిప్రాయాలు
కేంద్రానికి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థను మార్చేస్తున్నారా?
ఈసీ నియామక విధానం నుంచి
‘సర్’ వరకు తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం స్వతంత్రతపై తలెత్తుతున్న వరుస ప్రశ్నలు ఇప్పుడు నేరుగా మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్య చిత్తశుద్ధిపై చర్చకు దారితీస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల కమిషనర్ల నియామక విధానం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు, విమర్శకులు మోడీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థపై తన ప్రభావాన్ని పెంచుకుంటోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నిర్మాణాన్ని తీసుకురావడం, ఓటర్ల జాబితా మార్పులపై ఈసీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఎన్నికల సంఘం ఖండిస్తూ.. తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంత స్వతంత్రంగా పనిచేస్తోంది? మోడీ ప్రభుత్వానికి, ఎన్నికల యంత్రాంగానికి మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉంది? అన్న ప్రశ్నలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల ఈసీలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వివిధ నిర్ణయాలపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. గత పది నెలల్లో సుమారు 14 సందర్భాల్లో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు నమోదు చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త పేర్ల చేర్పు, సర్ ప్రక్రియ తదితర అంశాలు ఇందులో ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఈసీ మాత్రం తమ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. కమిషనర్ల మధ్య చర్చల సమయంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, అవి తుది నిర్ణయాలను ప్రతిబింబించవని వెల్లడించింది.
అసలు సమస్య ఎక్కడ?
ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు. ఎవరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి, ఎవరి పేరు తొలగించాలి అనే విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియ పారదర్శకంగా, రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉండాలన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన సూత్రం. ప్రస్తుతం అమలవుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇదే కారణంతో వివాదం నెలకొంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగించబడుతున్న నేపథ్యంలో.. అర్హులైన ఓటర్లు కూడా జాబితా నుంచి బయటపడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఢిల్లీ సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కూడా ప్రశ్నలు లేవనెత్తింది. కొంతమంది ఓటర్లకు జారీ చేసిన నోటీసులు దాదాపు యాంత్రికంగా ఇచ్చినట్టుగా కనిపిస్తున్నా యని కోర్టు పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఓటర్లు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా స్పందించే అవకాశం కల్పించాలని కోర్టు సూచించింది.
జ్ఞానేశ్ నేపథ్యంపైనా చర్చ
జ్ఞానేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖలోని జమ్మూకాశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రభుత్వ ప్రక్రియలో ఆయన పనిచేశారు. అనంతరం కేంద్ర సహకార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థకు అధిపతిగా ఆయన నియామకం విషయంలో రాజకీయ ప్రభావానికి సంబంధించిన సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
వివరాలు బహిర్గతం
చేయాలంటూ డిమాండ్లు
జ్ఞానేశ్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈసీలో భిన్నాభిప్రాయాలు ఉండటం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేననీ, చివరకు నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారన్న విషయాన్ని బీజేపీ పేర్కొంటోంది. ఈసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్షాలు, విమర్శకుల ప్రశ్న మాత్రం వేరుగా ఉంది. ఈసీ నిర్ణయాలపై నిజంగా ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? ఏ అంశాలపై చర్చ జరిగింది? ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులపై ఏ ప్రాతిపదికను అనుస రించారు? వంటి ప్రశ్నలకు సంబంధించ ిన పూర్తి పత్రాలను ప్రజల ముందుం చాలని వారు కోరుతున్నారు. ఎన్నికల సంఘం పారదర్శకతను నిరూపించుకో వాలంటే అంతర్గత అభ్యంతరాలు, సమావేశాల వివరాలు, నిర్ణయాలకు సంబంధించిన చట్టపరమైన ఆధారాలు, రాష్ట్రాల వారీగా ఓటర్ల జాబితా మార్పుల సమాచారాన్ని బహిర్గతం చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
ప్రజాస్వామ్యానికి అసలు పరీక్ష
భారత్‌లో తొలి సాధారణ ఎన్నికలు 1951–52లో నిర్వహించినప్పుడు.. కులం, మతం, ఆస్తి వంటి తేడాలు లేకుండా ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయం. ఆ తర్వాత ఎన్నికల సంఘం స్వతంత్రతను బలోపేతం చేసిన అనేక సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ సంస్థ స్వతంత్రతపైనే ప్రశ్నలు తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామమని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదనీ, నియామక విధానంలో మార్పులు, సర్‌పై పూర్తి పారదర్శకత, ఓటర్ల పేర్ల తొలగింపుపై వ్యక్తిగత నోటీసు, అప్పీల్‌కు సులభమైన అవకాశం, స్వతంత్ర విచారణ వంటి చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. చివరగా.. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయా అన్నది కాదు. ఆ ఎన్నికల్లో ప్రతి అర్హుడైన పౌరుడికి సమానంగా ఓటు వేసే అవకాశం ఉందా? ఎన్నికలను పర్యవేక్షించే సంస్థ అధికార పార్టీకి కాకుండా రాజ్యాంగానికి జవాబుదారీగా ఉందా? అన్నదే ప్రజాస్వామ్యానికి అసలైన కొలమానమని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు.
నియామక విధానమే
కీలక ప్రశ్న
ఎన్నికల సంఘం స్వతంత్రతపై చర్చలో 2023లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కూడా ప్రధాన అంశంగా మారింది. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టంలో సుప్రీంకోర్టు సూచించిన వ్యవస్థకు భిన్నంగా నియామక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని, ఆయన సూచించే కేంద్ర మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీలో ప్రభుత్వానికి ఇద్దరు సభ్యుల ప్రాతినిధ్యం ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం వంటి అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థ నియామకాల్లో అధికార పక్షానికి అధిక ప్రభావం ఉంటుందన్న విమర్శలు వచ్చాయి. ఇదే వ్యవస్థ కింద జ్ఞానేశ్ కుమార్ 2025లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
మోడీ ప్రభుత్వానికి ఇది ఎందుకు కీలకం?
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుందా లేదా అన్నది కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన అంశం కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లభించే ప్రజా మద్దతు కూడా ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల నిర్వహణ సంస్థపై ప్రజలకు నమ్మకం తగ్గితే.. ఎన్నికల ఫలితాలపై కూడా సందేహాలు పెరుగుతాయి. అందుకే మోడీ ప్రభుత్వం ఈ వ్యవస్థపై వస్తున్న అనుమానాలను కేవలం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయకుండా, మరింత పారదర్శకతతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న వాదన బలపడుతోంది.
మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్య చిత్తశుద్ధిపై సందేహాలు!
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 4 నిమిషాల చదవడం





కామెంట్లు (0)