యువజన గళాన్ని అణచేందుకు పోలీసుల యత్నం!
జంతర్‌మంతర్‌లో నిరసనకు సిద్ధం
‘జాబ్ చోరీ-ఓట్ చోరీ’ నినాదాలతో పోరు
దేశవ్యాప్తంగా వేలాదిగా తరలిరానున్న యువత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలనీ, నియామకాల్లో పారదర్శకత పాటించాలనీ, పోటీ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యువత చేపట్టనున్న ఆందోళనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరిం చడంతో శుక్రవారం జంతర్‌మంతర్‌లో నిరసన చేపట్టనున్నట్టు డీవైఎఫ్‌ఐ అధ్యక్షులు, ఎంపీ ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ కూడా మద్దతుగా నిలవనుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ‘జాబ్ చోరీ-ఓట్ చోరీ’ నినాదాలతో యువత నిరసన గళం వినిపించ నున్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, ఉపాధి అవకాశాలను విస్తరించాలని కోరను న్నారు. కేరళంతో సహా అన్ని రాష్ట్రాల నుంచి వేలాదిగా యువత తరలి రానున్నారు.
రెండుసార్లు నిరాకరణ
మార్చ్ నిర్వహణకు డీవైఎఫ్‌ఐ గత నెల ప్రారంభంలోనే ఢిల్లీ పోలీసులను అనుమతి కోరింది. తొలుత జంతర్‌మంతర్‌లో కార్యక్రమం నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారు. అనంతరం షహీదీ పార్క్‌లో నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా గురువారం ఎంపీ ఎఎ రహీం మాట్లాడుతూ మార్చ్ నిర్వహణకు అనుమతి నిరాకరణతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకునేందుకే ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలు విధించడమేనని తెలిపారు. శాంతియుతంగా నిర్వహించే నిరసనను అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ ఆందోళనలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువజన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఆదర్శ్ ఎం. సాజీ మాట్లాడుతూ ఉపాధి, ఉద్యోగాలు, ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగే పోరాటంలో విద్యార్థి, యువజన సంఘాలు ఐక్యంగా ముందుకు సాగనున్నాయి.






కామెంట్‌లు (0)