Magazines

రూ.2,000 దాటితే యూపీఐకి గుడ్‌బై

3 గంటల క్రితం

UPI for transactions
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

76 శాతం మంది ప్రత్యామ్నాయాల బాట

నగదు, కార్డుల వైపు మొగ్గు :
లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి
నేడు దేశవ్యాప్తంగా యూపీఐ డే


న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో కీలకంగా ఉన్న యూపీఐ లావాదేవీల చార్జీలపై వినియోగదారుల్లో క్రమంగా ఆందోళన పెరుగుతోంది. అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపైకి బదిలీ చేస్తే 76 శాతం మంది యూపీఐ వినియోగదారులు ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను ఎంచుకోనున్నట్టు లోకల్‌సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో కేవలం 14 శాతం మంది మాత్రమే అదనపు చార్జీలను చెల్లించి యూపీఐని కొనసాగిస్తామని చెప్పారు. దీంతో ఆరేండ్లుగా వ్యాపారులకు ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ మర్చంట్‌ చెల్లింపులపై ఎండీఆర్‌ ప్రభావం ‌తీవ్రంగా ఉండొచ్చని స్పష్టమవుతోంది. నగదు, కార్డుల వైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులపై అదనపు చార్జీని మోపితే 27 శాతం మంది నగదుతో చెల్లిస్తామని వెల్లడించగా.. 26 శాతం మంది క్రెడిట్‌ కార్డు, 14 శాతం మంది డెబిట్‌ కార్డును ఉపయోగిస్తామని తెలిపారు. మరో 4 శాతం మంది నెఫ్ట్‌, ఐఎంపిఎస్‌ వంటి బ్యాంకు బదిలీలను, 9 శాతం మంది ఇతర చార్జీలేని చెల్లింపు మార్గాలను ఎంచుకుంటామని చెప్పారు. ఇది యూపీఐ అదనపు చార్జీలపై తీవ్ర వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది.

మరోవైపు వ్యాపారుల్లోనూ ఎండీఆర్‌‌పై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. సర్వేలో కేవలం 17 శాతం మంది మాత్రమే 0.4 శాతం ఎండీఆర్‌ను భరిస్తామని చెప్పారు. 41 శాతం మంది ఎలాంటి ఎండీఆర్‌ భరించబోమని, 9 శాతం మంది యూపీఐ చెల్లింపులనే స్వీకరించబోమని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి ఎండీఆర్‌ వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, వ్యాపారులు ఆ భారాన్ని ధరలు పెంచడం లేదా ఇతర మార్గాల్లో బదిలీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పడు కీలకంగా మారింది. ముఖ్యంగా అధిక విలువైన కొనుగోళ్లలో యూపీఐకి బదులుగా నగదు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వైపు 76 శాతం మంది మొగ్గు చూపుతామని చెప్పడం డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు పెద్ద హెచ్చరికగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అక్టోబర్‌ 15 తర్వాత ఈ నిబంధనల అమలు తీరు, వ్యాపారుల స్పందన, వినియోగదారుల చెల్లింపుల్లో వచ్చే మార్పులే యూపీఐ ఎండిఆర్‌ ప్రభావాన్ని నిర్ణయించనున్నాయంటున్నారు. కాగా శుక్రవారం నో యూపీఐ డే ను దేశవ్యాప్తంగా పాటించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్