సాధారణంగా పీరియడ్స్ సమయంలో నడుము నొప్పి, కడుపు నొప్పి, అలసట, నీరసం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ఇవే కాకుండా రుతుచక్రం జీర్ణ వ్యవస్థ పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ సమయంలో వివిధ జీర్ణ సంబంధిత సమస్యలూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పీరియడ్స్‌లో ఇవి సర్వసాధారణమే. మరి, ఆ సమస్యలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీరియడ్స్ సమయంలోనూ ఉల్లాసంగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం...
పీరియడ్స్‌లో శారీరక నొప్పులు, మానసిక ఒత్తిళ్లు, అలసట వంటి సమస్యలకు హార్మోన్లలో వచ్చే మార్పులే కారణమని అందరికి తెలిసిందే. అయితే, వీటిలో హెచ్చుతగ్గులే ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ పనితీరు పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ ప్రారంభానికి వారం రోజుల ముందు ప్రొజెస్టరాన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, పేగుల్లో ఆహార కదలికలు నెమ్మదిస్తాయి. దీనివల్ల గ్యాస్ ఏర్పడి కడుపుబ్బరానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
బ్లీడింగ్ ప్రారంభం కాగానే
నెలసరి సమయంలో ఎదురయ్యే దుష్ప్రభావాల కారణంగా విశ్రాంతి తీసుకోవడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. ఫలితంగా వ్యాయామం చేయకపోవడం, జంక్ఫుడ్స్ తినాలన్న కోరిక, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వంటి మార్పులన్నీ మలబద్ధకానికి దారితీస్తాయి. శారీరక శ్రమ కొంతమంది మహిళలకు రుతుక్రమ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొంతమందిలో బ్లీడింగ్ ప్రారంభం కాగానే ప్రొస్టాగ్లాండిన్లు అనే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పేగుల్లో ఆహార కదలికల వేగాన్ని పెంచి, విరేచనాలకు దారితీస్తాయి. ఈ క్రమంలో గర్భనిరోధక మాత్రలు తీసుకునే ఆరోగ్యకరమైన మహిళల్లో రుతుస్రావం మొదటి రోజున జీర్ణకోశ అసౌకర్యం ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. ఇక కొంతమందిలో వికారం, వాంతులవడం వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
పీరియడ్స్ సమయంలో ఈ జీర్ణ సంబంధిత సమస్యలన్నీ సర్వసాధారణమే అని నిపుణులు చెబుతున్నారు. నెలసరి పూర్తవగానే ఇవి తగ్గుముఖం పడతాయని అంటున్నారు. ఆలోపు చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్నే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కెఫెన్, పాలు, పాల పదార్థాలు, నూనె పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు వంటి వాటికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, గింజలు, విత్తనాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవాలి.
తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తడి పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. తద్వారా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడచ్చని సలహా ఇస్తున్నారు.
ఫైబర్ అధికంగా లభించే ఓట్స్, కాయగూరలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.
అలాగే, నీళ్లు ఎక్కువగా తాగడం కూడా ముఖ్యమంటున్నారు. తద్వారా అజీర్తి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి పొందచ్చని తెలియజేస్తున్నారు.
వికారంగా అనిపిస్తే అల్లం, పెప్పర్మెంట్ టీ తాగడం వల్ల ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
ప్రొబయాటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు తీసుకోవడం వల్ల విరేచనాల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని తెలియజేస్తున్నారు.
ఈ చిట్కాల వల్ల ఉపశమనం కలగకపోయినా.. జీర్ణ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉన్నట్లనిపించినా.. ఆలస్యం చేయ కుండా డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే, ఈ దుష్ప్రభావాలు కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిదని వివస్తున్నారు.
ప్రతి ఐదుగురిలో ఒకరు...
భరతదేశంలోని పాఠశాల విద్యార్థినుల్లో పీరియడ్స్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం, ప్రతి ఐదుగురు పాఠశాల విద్యార్థినుల్లో ఒకరు క్రమరహిత పీరియడ్స్ ఎదుర్కొంటున్నారు. అయితే క్రమరహిత పీరియడ్స్ ఉన్నంత మాత్రాన దానిని వెంటనే పీసీఓఎస్‌గా భావించలేమని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ఎయిమ్స్ సర్వే పూర్తి వివరాల్లేంటో ఇప్పుడు చూద్దాం..
టీనేజ్ బాలికల్లో క్రమరహిత పీరియడ్స్ సమస్య ప్రమాదకరంగా పెరుగుతోందని ఎయిమ్స్ (AIIMS) సర్వే వెల్లడించింది. 2023 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 4,000 మంది విద్యార్థినులపై చేపట్టిన ఈ సర్వేలో.. ప్రతి ఐదుగురు అమ్మాయిలలో ఒకరు క్రమరహిత పీరియడ్స్ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
పీరియడ్స్ సరిగ్గా రాకపోతే చాలామంది వెంటనే పీసీఓఎస్ అని భయాందోళనకు గురవుతుంటారు. దీనిపై ఎయిమ్స్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రజినీ శర్మ మాట్లాడుతూ..
పీరియడ్స్ మొదలైన తొలి రోజుల్లో/సంవత్సరాలలో కొన్ని మార్పులు, అసమానతలు ఉండటం సాధారణం. క్రమరహిత పీరియడ్స్ ఉన్నంత మాత్రాన పీసీఓఎస్ ఉన్నట్లు కాదు. కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్ నివేదికలో పోలీసిస్టిక్ ఓవరీస్ అని వచ్చినంత మాత్రాన అది టీనేజర్లలో పీసీఓఎస్ కిందకు రాదు అని స్పష్టం చేశారు. తీవ్రమైన పింపుల్స్, ముఖం లేదా శరీరంపై అతిగా వెంట్రుకలు రావడం వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నప్పుడే వైద్యులు పీసీఓఎస్‌గా నిర్ధారిస్తారు.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
రెండు పీరియడ్స్ మధ్య వ్యవధి 21 రోజుల కంటే తక్కువగా ఉన్నప్పుడు. లేదా రెండు పీరియడ్స్ మధ్య సమయం 35 రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. వరుసగా మూడు నెలల పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోయినప్పుడు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
మానసిక, శారీరక ప్రభావం: క్రమరహిత పీరియడ్స్ లేదా పీసీఓఎస్ సమస్యలు కేవలం మాసిక ధర్మానికే పరిమితం కాకుండా.. ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన మెటబాలిక్ సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా బరువు పెరగడం, శరీరంలో మార్పుల వల్ల టీనేజ్ అమ్మాయిలలో ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
పరిష్కారం ఏమిటి: చిన్న వయసులోనే అవసరం లేని మందులు వాడటం కంటే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. రోజువారీ వ్యాయామం, శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటూ.. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల ఎత్తు, బరువు పెరుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చు.






కామెంట్‌లు (0)