Magazines

నెం.1 స్ట్రీట్ లిఫ్టర్ ప్రబ్లీన్

4 గంటల క్రితం

Prableen
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 5 నిమిషాల చదవడం

ప్రబ్లీన్ కౌర్ గిల్... ఒకప్పుడు ఒక్క చిన్‌ ఆప్‌, పుల్‌ అప్‌ కూడా చేయలేకపోయింది. అలాంటి ఆమె ఇప్పుడు ఆసియా నెం.1 స్ట్రీట్ లిఫ్టర్‌‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహిళలు అత్యంత తక్కువగా ఉన్న ఈ రంగంలో ఆమె ప్రయాణం అంత సులభంగా ఏమీ లేదు. తనకు ఎదురైన అడ్డంకులు నేడు మరింత మంది మహిళలను బలంగా మారేలా ప్రేరేపించాలనే తన లక్ష్యం గురించి ఇటీవలె ఆమె ఓ వెబ్‌‌సైట్‌‌తో మాట్లాడారు. ఆ వివరాలు ఈరోజు మానవిలో...



ప్రబ్లీన్ కౌర్ గిల్ కాలిస్థెనిక్స్ చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, తాను ఒక్క చిన్-అప్ లేదా పుల్-అప్ కూడా పూర్తి చేయలేకపోయారు. అదే ఆమెలో పట్టుదలను పెంచింది. ఆరు నెలల తర్వాత పోటీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. దానికి పది పుల్-అప్‌లు చేయాల్సి వుంటుంది. ‘పోటీ సమయానికి, నేను పది పుల్-అప్‌లు చేసే స్థాయికి చేరుకుని, రెండవ ర్యాంకు సాధించాను. ఆ క్రీడలో ఎక్కువ మంది అమ్మాయిలు లేరు, అదే నన్ను ప్రేరేపించింది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. నేడు.. ప్రబ్లీన్ స్ట్రీట్ లిఫ్టింగ్‌లో ఆసియాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇది పుల్-అప్ బార్‌పై పవర్‌లిఫ్టింగ్ లాగా పనిచేసే ఒక క్రీడ. ఇందులో అథ్లెట్లకు నాలుగు కదలికలలో ప్రతిదానిలో ఒక రెపిటీషన్ చొప్పున మూడు ప్రయత్నాలు వుంటాయి. మజిల్-అప్, పుల్-అప్ లేదా చిన్-అప్, డిప్, స్క్వాట్.. ఇవన్నీ అదనపు బరువుతో చేస్తారు. 13.75 కిలోల బరువుతో ఆమె చేసిన మజిల్-అప్ ఒక జాతీయ రికార్డు. ఆమె 37.5 కిలోలతో చిన్-అప్, 65 కిలోలతో డిప్స్, 115 కిలోలతో స్క్వాట్స్ కూడా చేస్తున్నారు. నవంబర్‌లో సింగపూర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పోటీపడబోతున్నారు.


ఈత నుండి విషయాలు

జలంధర్‌లో పుట్టి పెరిగిన ప్రబ్లీన్ చిన్నప్పుడు నిత్యం తల్లి చాటు తిరిగే ఓ సాధారణ బాలిక. అయితే జాతీయ స్థాయి ఈత క్రీడాకారిణిగా ఆమె ఎన్నో నేర్చుకుంది. ఆ దినచర్య ఆమెకు అలవాటుగా మారింది. ఆమెకు 12 ఏండ్లు ఉన్నపుడు కుటుంబం ముంబైకి మారింది. అయితే కొంతకానికే ప్రబ్లీన్ తన అన్నతో పాటు హైదరాబాద్‌ చేరుకుంది. అక్కడ అతను ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. హైదరాబాద్‌లో ఆమె జీవితం మారిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల తన సమస్యలను తానే పరిష్కరించు కోవడం, స్నేహితులను పెంచుకోవడం, పరిచయం లేని వాతావరణంలో తన దారిని తాను కనుక్కోవడం వంటివి ఆమెకు అలవాటయ్యాయి. మరింత స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో మారింది. అయితే రెండేండ్లు ఈతకు ప్రాధాన్యం తగ్గింది. మూడవ ఏడాదిలో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి రెండవ స్థానంలో నిలిచింది. 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఆమె ముంబైకి తిరిగి వచ్చింది. ఉన్నత విద్యకు కాస్త గ్యాప్‌ ఇచ్చి నటన, మేకప్ వంటి రంగాలలో కెరీర్‌లను అన్వేషించింది, కానీ ఫలించలేదు.


మద్యానికి బానిసై...

2017–18లో ప్రబ్లీన్ తన జీవితంలో ఏం చేయాలో ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. చదవడం వల్ల తనను తాను బాగా అర్థం చేసుకోగలనని నమ్మి పుస్తకాల వైపు మళ్లింది. కానీ తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదు. నిత్యం మద్యం సేవిస్తూ గడిపేది. ఒక రాత్రి ఆమె ఎంతగా తాగిందంటే తల్లి ఆమెకు బట్టలు మార్చాల్సి వచ్చింది. అప్పుడు ప్రబ్లీన్‌కు 18 ఏండ్లు. ఆ సంఘటన ఆమెకు కనువిప్పు కలిగించింది. ‘‘నేను మార్పు గురించి చాలా చదువుతున్నాను కానీ దాన్ని అనుసరించడం లేదని గ్రహించాను’’ అని ఆమె గుర్తుచేసుకుంది. ఆ అనుభవం, తన జీవితంతో తాను ఏమి చేస్తోందో అని ప్రశ్నించుకునేలా ఆమెను ప్రేరేపించింది. వ్యాయామం చేయడం ప్రారంభించింది. ఏదీ ఏమైనా వ్యాయామం కచ్చితంగా చేయాలని తనకు తాను ఓ వాగ్దానం చేసుకున్నారు. 2019లో ఆమె ఆ నిబద్ధతను మరో అడుగు ముందుకు తీసుకువెళ్లారు. కేవలం స్ట్రెచింగ్ సెషన్ మాత్రమే చేయగలిగినా సరే, తప్పకుండా చేయాలని తనకు తాను చెప్పుకుంది. చివరికి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించినప్పుడు, ఆ తత్వమే దానికి పునాది అయింది. ఆమె తన పరివర్తనను కేవలం శారీరకంగానే కాకుండా, ఒక వ్యక్తిగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు


కాలిస్థెనిక్స్ ఎలా మార్చింది..?

ఒక స్నేహితురాలు ఆమెకు కాలిస్థెనిక్స్‌ను పరిచయం చేసింది. దాంతో ఆమె జీవితం శాశ్వతంగా మారిపోయింది. ఆసియా ఫైనల్స్‌కు అర్హత సాధించిన సింగపూర్ ఓపెన్‌ను గెలిచి ఆమె నెం.1 ర్యాంకును సంపాదించింది. ఆ తర్వాత నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు క్వాలిఫైయర్ అయిన ఫిలిప్పైన్ ఓపెన్‌ను కూడా గెలుచుకున్నారు. అయితే ఈ ప్రయాణం శారీరకంగా, మానసికంగా సవాలుతో కూడుకున్నది. ‘‘నేను రెండడుగులు ముందుకు వెళ్తున్నానని అనిపించినప్పుడల్లా ఏదో నన్ను నాలుగు అడుగులు వెనక్కి లాగుతుంది’’ అని ప్రాబ్లీన్ అంటారు. కానీ ఆమె ఆ ఎదురుదెబ్బలను ఈ ప్రయాణంలో ఒక భాగంగా చూశారు. బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయంట్, అతని ప్రసిద్ధమైన “మాంబా మెంటాలిటీ” నుండి ఆమె స్ఫూర్తి పొందుతున్నారు. శిక్షణ సమయంలో చేసే కృషియే ఒక అథ్లెట్‌ను పోటీకి సిద్ధం చేస్తుందనేది ఆమె నమ్మారు.


గాయాలు ఆ మనస్తత్వాన్ని పరీక్షిస్తాయి

2024లో ప్రాబ్లీన్ చీలమండకు గాయం కావడంతో ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆ శస్త్రచికిత్సలో ఆమెకు ఒక ప్లేట్, మూడు స్క్రూలు అమర్చారు. రెండు మూడు నెలల పాటు వ్యాయామం చేయలేకపోయింది. ‘‘ఒక అథ్లెట్‌ను ఇది మానసికంగా, శారీరకంగా కూడా దెబ్బ తీస్తుంది. క్రీడలో కాళ్లను ఉపయోగించాలి. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు’’ అంటారు ఆమె. ఈ ప్రయాణంలో ప్రాబ్లీన్ మహిళలకు శక్తితో కూడిన క్రీడల చుట్టూ ఉన్న అనేక మూస ధోరణులను కూడా బద్దలు కొడుతున్నారు. ‘‘ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని నేను నమ్ముతున్నాను. మహిళలు తాము ఎంత బలంగా కనిపిస్తున్నామనే దాని గురించి, లేదా శారీరకంగా ఎలా ఉన్నామనే దాని గురించి ఆలోచించడం మానేసి, తాము ఎంత బలంగా ఆలోచిస్తున్నామో అనే దానిపై దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఆమె అంటారు.


డిజిటల్ డైరీ టు ఫిట్‌నెస్ కమ్యూనిటీ

భారతదేశ జనాభాతో పోలిస్తే కాలిస్థెనిక్స్, స్ట్రీట్ లిఫ్టింగ్ ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని ప్రబ్లీన్ అంటున్నారు. చాలా మందికి స్వయంగా సాధన చేసినప్పటికీ కాలిస్థెనిక్స్ అంటే ఏమిటో తెలియదు. మరిన్ని పార్కులు, ఖాళీ స్థలాలు అందుబాటులోకి రావడంతో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. కానీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ‘‘కాలిస్థెనిక్స్ చాలా కష్టమని ప్రజలు అనుకుంటారు. అది నిజం కాదు. మీరు 360లు లేదా ఫ్యాన్సీ మూవ్స్‌తో ప్రారంభించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సున్నా నుండే ప్రారంభిస్తారు’’ అని ఆమె అంటారు. ప్రబ్లీన్ ఎప్పుడూ ఫిట్‌నెస్ క్రియేటర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలని అనుకోలేదు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించినప్పుడు, అది కేవలం తన సొంత పరివర్తనను నమోదు చేయడానికి, తన ప్రయాణానికి సంబంధించిన ఒక ‘‘డిజిటల్ డైరీ’’గా ఉండేది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 200,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రేక్షకులు పెరిగేకొద్దీ ఆమె కంటెంట్ ప్రభావం కూడా పెరిగింది. వీడియోలు చూసిన తర్వాత తమ మొదటి పుష్-అప్ లేదా పుల్-అప్ చేయడానికి ప్రయత్నించిన వారి నుండి ఆమెకు సందేశాలు రావడం మొదలైంది. ‘‘చివరికి నేను ప్రజల కోసం ఏదైనా చేయగలనని తెలుసుకున్నాను’ అని ఆమె అన్నారు. ఇతరులు తమకు సాధ్యం కాదని అనుకున్న దాన్ని అధిగమించి ముందుకు సాగేలా ప్రోత్సహించాలనే ఆశతో ప్రేరణాత్మక కంటెంట్‌ను సృష్టించడం, మానవ శరీరం ఏమి సాధించగలదో ప్రదర్శించడం ప్రారంభించింది.


పెద్ద సమాజాన్ని నిర్మించాలి

ఇప్పటి నుండి ఐదేళ్ల తర్వాత, తాను ఎక్కడ ఉండాలనుకుంటుందో అనే దానిపై ప్రాబ్లీన్‌కు స్పష్టమైన దృష్టి ఉంది. ‘‘కచ్చితంగా నేను ప్రపంచ ఛాంపియన్‌గా ఉంటానని అనుకుంటున్నాను’’ అని ఆమె అంటున్నారు. కానీ ఆమె ఆశయాలు తన సొంత విజయాలకు మించి ఉన్నాయి. ఆమె మహిళలతో ఓ పెద్ద సమాజాన్ని నిర్మించాలని, అంతర్జాతీయ ఈవెంట్‌లను నిర్వహించాలని, తన సమాజంలోని మహిళలను ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ‘‘అమ్మాయిలతో కలిసి ఒక పెద్ద సమాజాన్ని నిర్మిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మరింత బలంగా తయారు చేస్తూ, నేను నన్ను అక్కడే చూసుకుంటాను. అదే నా లక్ష్యం’’ అంటూ ఆమె తన మాటలు మాగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్