వివేక్ శాన్ బాగ్ అనే కన్నడ రచయిత కన్నడంలో, ఆంగ్లంలో రచనలు చేస్తారు. ఆయన కన్నడం లో రాసిన ఘాచర్ ఘోచర్ (Ghachar Ghochar) నవల 2013 లో ప్రచురింపబడి, తర్వాత ఇంగ్లిష్‌లోకి అనువదింపబడింది. అది అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. 2024 లో ఈ వ్యాస రచయిత సాహిత్య అకాడమీ అవార్డును తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లినప్పుడు, అకాడమీ వారు అక్కడ ఆయనచేత ఆంగ్లంలో ప్రసంగింపజేశారు. చాలా చక్కని ప్రసంగం అది.
వివేక్ శాన్ బాగ్ రెండు నెలల క్రితం హైఫన్ అనే ఒక గ్రూప్‌ను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా భాషాపరమైన – ఇంకా సరిగ్గా చెప్పాలంటే అనువాదాల పరమైన – అనుసంధాన సంస్థ. భారతదేశంలోని వివిధ భాషలలోని రచనలను ఆంగ్లంలోకి అనువదింపజేయడం, ప్రతి ఆరు నెలలకొకసారి ఒక ఉన్నత స్థాయి సాహిత్య పత్రికను వెలువరించడం ఈ సంస్థ చేయబోయే ముఖ్యమైన పనులలో కొన్ని. ప్రసిద్ధ కవి, రచయిత ఎ.కె. రామానుజన్ తనను తాను ఇండో-అమెరికన్ భాషల మధ్య హైఫన్‌గా అభివర్ణించుకున్నారట.
Hyphen ... How fine! ఏదైనా సాహితీపరుల గ్రూప్‌కు – ఆ మాటకోస్తే ఏ గ్రూప్‌కు ఐనా – హైఫన్ అనే ఈ పేరు అద్భుతంగా నప్పుతుంది కదా. అవునంటాను నేను. అదెలానో చూద్దాం: ఆంగ్లభాషలో అడ్డుగీతలు మూడు రకాలుగా ఉంటాయి (ఇతర భాషలలో కూడా ఇంగ్లిష్‌లోని విరామ చిహ్నాలనే వాడుతున్నారు.). అవి హైఫన్, ఎన్ డ్యాష్, ఎమ్ డ్యాష్. మొదటిది ఈ మూడింటిలో అతి పొట్టిది, ఎమ్ డ్యాష్ అతి పొడవైనది. దాని నిడివి హైఫన్ నిడివికి రెండింతలు. ఎన్ డ్యాష్ నిడివి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ డ్యాష్ N అంత నిడివిని, ఎమ్ డ్యాష్ M అంత నిడివిని (అడ్డంగా) కలిగి ఉంటాయి. హైఫన్ రెండు పదాలను కలుపుతుంది. ఉదాహరణకు తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువు.
ఆంగ్లంలో అయితే well-known, ill-defined మొదలైనవి ఉదాహరణలు. హైఫన్ కు ఇరువైపులా ఎప్పుడూ (అమెరికన్ ఇంగ్లిష్ ప్రకారమైనా, బ్రిటిష్ ఇంగ్లిష్ ప్రకారమైనా) స్పేస్ ఉండకూడదు. ఎన్ డ్యాష్ శ్రేణులను (ranges) ను సూచిస్తుంది. ఉదాహరణకు, ఫలానా ఊరు ఫలానా ఊరుకు 200 – 220 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మరొక ఉదాహరణ, ఫలానా రచయిత 1821 – 1882 ల మధ్య జీవించాడు. అమెరికన్ ఇంగ్లిష్ ప్రకారం ఈ ఎన్ డ్యాష్ కు కూడా ఇరువైపులా స్పేస్ ఉండకూడదు. కానీ బ్రిటిష్ ఇంగ్లిష్ ప్రకారం ఉండొచ్చునంటారు. కామన్ వెల్త్ దేశం అయిన మన దేశంలోని ఇండియన్ ఇంగ్లిష్ లో చాలా వరకు బ్రిటిష్ ఇంగ్లిష్ ను పాటిస్తాం కాబట్టి, కొందరు ఎన్ డ్యాష్ కు, ఎమ్ డ్యాష్ కు ఇరువైపులా స్పేస్ ఇస్తారు. సాహిత్య అకాడమీ వారి ఇండియన్ లిటరేచర్ పత్రికలో కూడా ఇలా ఉండటం మనం గమనించవచ్చు. ఎమ్ డ్యాష్ రెండు పదబంధాలను లేక వాక్యభాగాలను విడదీస్తుంది. కామాకన్నా ఎక్కువ విరామాన్నీ, సెమి కోలన్, ఫుల్ స్టాప్ ల కన్న తక్కువ విరామాన్నీ సూచిస్తుంది. ఉదాహరణకు, పిల్లల వ్యాధులు – జాగ్రత్తలు. అదనపు సమాచారాన్ని ఇచ్చే సందర్భాలలో కూడా దీన్ని వాడుతారు. ఈ ఎమ్ డ్యాష్‌ను ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి ఎమిలీ డికిన్సన్ విరివిగా వాడటం కూడా గమనించతగిందే. అయితే అది అమెరికన్ ఇంగ్లిష్ కాబట్టి ఇరువైపులా స్పేస్ ఉండదు. కొన్ని కంప్యూటర్ కీబోర్డులలో ఈ ఎమ్ డ్యాష్ ఉండకపోవచ్చు. అప్పుడు ఎన్ డ్యాష్‌కూ, ఎమ్ డ్యాష్ కూ ఎన్ డ్యాష్‌నే వాడాల్సివస్తుంది. ఆంగ్లభాషా నియమాలతో వచ్చిన చిక్కేమిటంటే, ఒకటికన్న ఎక్కువ స్టైల్ గైడ్స్ ఉంటాయి.
AP Stylebook (Associated Press), Chicago Manual of Style (CMOS), APA Style (American Psychological Association), MLA Style (Modern Language Association) ప్రధానమైనవి. ఏ స్టైల్లో రాస్తే ఆ గైడ్ లో సూచితమైన పదస్వరూపాలనే వాడాలి. అందుకే తెలుగులో ఒకే ఒక్క స్టైల్ గైడ్ ను రూపొందించాలని నేను కోరుతూ వస్తున్నాను. కానీ ఏ ప్రభుత్వ సాహిత్య సంస్థ గానీ, ప్రైవేటు సంస్థ గానీ నా విన్నపాన్ని పట్టించుకోవడం లేదు. అడ్డుగీతల గురించి ఇంత పెద్ద తతంగం ఉంది. ఈ తతంగంలోని కొంత భాగాన్ని ఈ వ్యాసరచయిత ఇంతకు ముందే ఒక వ్యాసంలో పేర్కొన్నాడు కానీ, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మళ్లీ మరికొంత వివరంగా రాశాడు.
పైన ఒకచోట ఇండియన్ ఇంగ్లిష్ అనే మాటను వాడాను కదా. దాని లక్షణాలేమిటి అన్న సందేహం కలుగవచ్చు పాఠకులకు. ఇండియన్ ఇంగ్లిష్, బ్రిటిష్ ఇంగ్లిష్‌కు అతి దగ్గరగా ఉంటుంది. కాకపోతే భారతీయ భాషలలోని పదాలను ఉన్నదున్నట్టుగా ఆంగ్ల లిపిలో రాస్తారు. ఉదాహరణకు అరేను Arre అనీ, అయ్యోను Aiyo అనీ, అక్కాను Akka అనీ, అన్నాను Anna అనీ … ఇలా. మొదట్లో ఈ వ్యాసరచయిత ఈ పద్ధతిని నిరసించేవాడు. కానీ ఈ రోజుల్లో బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్న రచయితలు కూడా ఈ ఇండియన్ ఇంగ్లిష్‌ను వాడుతున్నారు కనుక, ఇప్పుడది నిస్సందేహంగా ఆమోదయోగ్యమైనది. Memsaab, om, mantra, sutra, guru, pundit, avatar, juggernaut, bungalow మొదలైన ఎన్నో మాటలు ఎప్పుడో ఆంగ్లభాషలో కలిసిపోయాయి.
హైఫన్ రెండు పదాలను కలుపుతుందని చెప్పుకున్నాం కదా. వివేక్ శాన్ బాగ్ ప్రారంభించిన హైఫన్ అనే సంస్థ ఇదే విషయాన్ని ప్రతీకాత్మకంగా చెప్తుంది. అదన్నమాట అసలు సంగతి!
ఎలనాగ
హైఫన్ ... హౌ ఫైన్!
45 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)