2024 నుంచి ఉన్న బకాయిల్లో రెండింటి విడుదల
కరువుపై క్యాబినెట్ సబ్ కమిటీలో అత్యవసర చర్చ
ఎల్ నినోపై అఖిలపక్ష సమావేశం..
రైతు సంఘాలు, నిపుణులతో భేటీలు
సాయం కోసం కేంద్ర మంత్రులను కలవాలి
22 ఏపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిద్దాం
రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం :
వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు, రెండు డీఆర్ లు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏలలో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బకాయి పడ్డ ఎరియర్స్ ను వాయిదాల్లో చెల్లిస్తారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర 37వ క్యాబినెట్ అనేక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ఉద్యోగులకు 2024 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు డీఏలను ఇవ్వాలని నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయాలను గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల సంతోషం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామనీ, రెండు డీఏలతో సంవత్సరానికి రూ.2,500 ఆర్థిక భారం పడుతున్నా సరే... ఉద్యోగులు, పెన్షనర్ల కోసం సంతోషం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కీలకమైన 22-ఏకు సంబంధించి పెండింగ్ అప్లికేషన్లు, బిల్డింగ్ అనుమతులు, లేఅవుట్ పర్మిషన్లకు సంబంధించి వచ్చే క్యాబి నెట్‌లో నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, ఇతర అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ ఆదేశించింది.
క్యాబినెట్ నిర్ణయాలు ఇవే...
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోని తలెత్తిన సాగునీరు, కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, దీంతో సంబంధమున్న విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిన పరిస్థితులను క్యాబినెట్ చర్చించింది. సరాసరిగా 15 వేల మెగావాట్ల వినియోగం ఉండే విద్యుత్ గతేడాది 16 వేల మెగావాట్లకు చేరింది. దేశంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా సెప్టెంబర్ 30న రాష్ట్రంలో 19,892 మెగావాట్ల వినియోగానికి చేరింది. వ్యవసాయం కోసం రైతులు బోర్లు, ఇతరత్రా విద్యుత్ వినియోగించడంతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో హౌసింగ్ సెక్టార్ లో వినియోగం పెరిగిపోయినట్టు గుర్తించింది. అదే విధంగా సెప్టెంబర్ 30తో నైరుతి రుతు పవనాలు ఆగిపోవడం, ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప మళ్లీ వర్షం కురిసే పరిస్థితి లేని నేపథ్యంలో విద్యుత్, వివిధ దశల్లో ఉన్న వ్యవసాయ పంటలు, ఇండ్లు, పరిశ్రమలు, తాగునీటి అవసరాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తు డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది.
ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. వానాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉందనీ, సెప్టెంబర్ 30తో నైరుతి రుతుపవనాల కాలం ముగిసిందనీ, 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో అత్యవసరంగా చర్చించి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించి సాయాన్ని కోరనున్నది.
-ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని సివిల్ సప్లయిస్ విభాగం అంచనా వేసింది.
కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది. -రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని మొదటి దశకు రూ.650 కోట్లను మంజూరు చేసింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది. -దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పున: సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది. -న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)