Magazines

సమాజహితమే సాహిత్యం

1 గంట క్రితం

welfare of society.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

రాయడమే కాదు చదివించడమూ రచయితల పనే

ప్రగతిశీల భావాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి : తెలంగాణ సాహితి పుస్తకావిష్కరణలో వక్తలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమాజ హితం కోసం విరివిగా సాహిత్యం రావాల్సిన ఆవశ్యకతను పలువురు వక్తలు నొక్కి చెప్పారు. ఆలాంటి సాహిత్యం ఈ దశాబ్దకాలంలో తగ్గడం పట్ల, ఉన్నది ఉన్నట్టు చెప్పలేని స్థితిలో సమాజం ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర పరిణామాలపై ఎప్పటికప్పుడు సాహిత్యాన్ని రాయాలనీ, అదే సమయంలో రాసిన సాహిత్యాన్ని ప్రజలతో చదివించే బాధ్యత కూడా రచయితలపైనే ఉందని నొక్కిచెప్పారు. ప్రగతిశీల భావాలను క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. సాహిత్య అభివృద్ధి కోసం తెలంగాణ సాహితి చేస్తున్న కృషిని అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచికను కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్‌ ‌నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, సీనియర్‌ ‌జర్నలిస్టు, సాహిత్య విశ్లేషకులు కె.శ్రీనివాస్‌, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ ‌రాంపల్లి రమేశ్‌, రచయిత్రి జూపాక సుభద్ర సాహితీ స్రవంతి(ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డాక్టర్‌ ‌పసునూరి రవీందర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ఎస్‌.రఘు, తెలంగాణ సాహితీ నాయకులు అనంతోజు మోహనకృష్ణ, సలీమ, ఏభూషి నరసింహా, శరత్‌ ‌సుదర్శి, రేఖ, నస్రీన్‌‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం సిధారెడ్డి మాట్లాడుతూ..

మానవ మనస్సు లోతు పొరల్లోంచి వచ్చే భావోద్వేగాలు ఏఐ రచనల్లో కనిపించవన్నారు. ఏఐ ద్వారా సాహిత్య సృష్టి ఆత్మహత్యా సదృశ్యమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ, సామాజిక చైతన్యం ఉన్న రచయితలు కూడా ఉన్నది ఉన్నట్టుగా సాహిత్యం ద్వారా విరివిగా చెప్పలేని స్తబ్ద స్థితిలో ఉండటం శ్రేయస్కరం కాదన్నారు. ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఘటన మీద ఆశించిన సాహిత్యం రావడం లేదనీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత దశాబ్ద కాలంలో యువతను చైతన్యపరిచే, ఆలోచింపజేసే సాహిత్యం రాలేదని చెప్పారు. కె.శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ..గ్రామీణ స్థాయి వరకు విస్తరించిన మతోన్మాద భావజాలాన్ని తిప్పికొట్టేందుకు ప్రగతిశీల భావాలు గల సాహిత్యాన్ని క్షేత్రస్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రచయితలపై ఉందని చెప్పారు. జూపాక సుభద్ర మాట్లాడుతూ.. కింది స్థాయి నుంచి సాహిత్య ప్రక్రియ కొత్త చూపుతో రావాలని ఆకాంక్షించారు. నవలు, కథలను విరివిగా రాయాలని రచయితలకు పిలుపునిచ్చారు. పసునూరి రవీందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని నిరంతరం చైతన్యపరిచిన పాట నేడు వినోదంగా మారిందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పాటలు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అణగారిన వర్గాలకు అన్యాయం చేసేలా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ ‌రిజర్వేషన్లను ప్రశ్నిస్తూ ఒక్క పాట కూడా రాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రఘు మాట్లాడుతూ.. తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక తెలుగు సాహిత్యంపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు ఒక రెఫరెన్స్‌‌ గ్రంథంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సాహితి బృందాన్ని అభినందించారు. కెంగార మోహన్‌ ‌మాట్లాడుతూ..ప్రజల్లో ఆలోచనలు రేపే సాహిత్యాన్ని పాలకులు సహించలేకపోతున్నారన్నారు. తెలంగాణలో దశాబ్దికాలంలో సాహిత్య ప్రక్రియలపై ఒక గ్రంథం తీసుకురావడం మంచి పరిణామం అని కొనియాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్