భారతదేశ నిరుద్యోగిత రేటు 2017-18 నుంచి 2023-24 మధ్య ఐదేండ్ల కాలంలో 61శాతం నుంచి 22 శాతానికి పడిపోయింది. (నిరుద్యోగం కాదు - అనువాదకుడు) అదే సమయంలో శ్రామిక మహిళల సంఖ్య, మొట్ట మొదటిసారి పెరిగింది. దీన్నే ప్రభుత్వం బాగా డబ్బా వాయించుకుంటోంది. ఈ సందర్భంలో ఎలాంటి ఉద్యోగాలు పెరిగాయి? వాటి పని పరిస్థితులేమిటి? వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఉపాధి పెరగడమంటే గౌరవ ప్రదమైన, భద్రమైన నికరమైన ఉపాధి దొరికినట్టు కాదు. దుస్తుల తయారీ పరిశ్రమలోని కాంట్రాక్టు కార్మికులు, గిగ్ పనివారు ఎటువంటి బీమా సౌకర్యం లేకుండా పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలోని కార్మికులు పేరుకి కార్మికులుగా చెప్పుకుంటున్నా, ఎటువంటి పెయిడ్ లీవు సౌకర్యం లేకుండానే ఉన్నారు. గౌరవప్రదమైన జీవితాలకు వెలుపలే ఈ కార్మికులున్నారు. గౌరవప్రదమైన జీవితమంటే ఐఎల్‌ఓ నిర్వచనం ప్రకారం సమానపనికి సమాన వేతనం రావడం. పని ప్రదేశంలో హక్కులు, సాంఘిక భద్రత గౌరవం దక్కడం.
ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి-8)లో అంతర్భాగం. ఈ లెక్కన చూస్తే భారతదేశంలో పెరిగిన ఉపాధి అంతా అసంఘటితంగానూ, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు, పెరుగుతున్న అసమానతలు - ఇదీ నేటి భారతం.
ఏది గౌరవప్రదమైన పని?
2017-18, 2023-24 మధ్య పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలను పరిశీలించి మన దేశంలోని ఉపాధి నాణ్యతను లెక్కించాం. నాణ్యమైన పని సూచిక (డీసెంట్ వర్క్ ఇండెక్స్ - డీడబ్ల్యూఐ)ను మూడు కోణాల్లో పరిశీలించాం. ఉపాధి స్థానం, ఉపాధి అవకాశాలు, సాంఘిక భద్రతలను ఐదు ప్రధాన ఉపాధి రంగాల్లో - వ్యవసాయం, తయారీ, నిర్మాణం, టోకు, చిల్లర వ్యాపారాలు, రవాణాలో అధ్యయనం చేశాం. కొంతకాలంగా దేశంలో పని పరిస్థితులు మెరుగైనాయి. మొత్తం మీద డీడబ్ల్యూఐ 2017-18లో 0.247 నుంచి 2023-24లో 0.302కు పెరిగింది. ఇది కొంత మెరుగుదలను సూచిస్తున్నా మొత్తం మీద పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానంగా ఈ పెరుగుదల ప్రాంతాలు, రంగాలు, కులాలు, లింగ బేధాల్లో కనపడుతుంది.
ద్వితీయ రంగంలోని తయారీ రంగం, తృతీయ రంగంలోని రవాణా రంగంలో పనిపరిస్థితుల్లో వృద్ధి కనపడుతోంది. తయారీ రంగ డీడబ్ల్యూఐ 0.324 నుండి 0.41కి సంఘటిత ఉపాధి పెరుగుదల వల్లనూ, డిజిటలైజేషన్ వల్లనూ ఈ మెరుగుదల వచ్చింది. రవాణారంగ డీడబ్ల్యూఐ (0.324 నుండి 0.35) ప్రధానంగా పట్టణ ప్రాంత లాజిస్టిక్స్, యాప్ ఆధారిత ఫ్లాట్‌ఫార్మ్ పని పెరగటంవల్ల సాధ్యమైంది. ఈ మెరుగుదల ఒక ఆందోళనకర పరిస్థితిని తెలియచేస్తున్నాయి. పని పరిస్థితి మెరుగైన రంగాల్లో సైతం సాంఘిక భద్రత అందని ద్రాక్షగానే ఉంది. అత్యధిక మంది కార్మికులు ఏ విధమైన రాతపూర్వక ఒప్పందాలు లేకుండానే ఉన్నారు. వీరికి జీతంతో కూడిన సెలవులు లేవు. పీఎఫ్, ఇన్సూరెన్స్‌లు లేవు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా కార్మిక హక్కుల రక్షణ, ఉద్యోగ భద్రతా లేవు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా కార్మిక హక్కుల పరిరక్షణ మాత్రం అదేవిధంగా మెరుగవడం లేదు.
మన దేశంలో అత్యధికమందికి ఉపాధి చూపించే వ్యవసాయరంగంలో ఉపాధి నాణ్యత మెరుగుకాలేదు. మా అధ్యయన కాలంలో వ్యవసాయరంగం డీడబ్ల్యూఐ నామమాత్రంగా 0.211 నుంచి 0.267కి పెరిగింది. అత్యధికమంది వ్యవసాయ కార్మికులు స్వయం ఉపాధి కార్మికులుగానో, లేదా నిలకడైన జీతంలేని కుటుంబ సభ్యులుగానో వున్నారు. వీరికి ఏ కార్మిక చట్టాల రక్షణా లేదు. ఇది తక్కువ ఉత్పాదకత గురించి మాత్రమే కాదు. అసంఘటిత రంగ విస్తరణకు సంబంధించినది. నిర్మాణ, చిల్లర వ్యాపార రంగంలో కూడా ఇదే కథ పునరావృతం అవుతుంది. కార్మికులు ఎక్కువగా క్యాజువల్ ఉద్యోగులుగానూ, సబ్ కాంట్రాక్టింగ్ చెయిన్స్‌లోనూ, భద్రతలేని కార్మికులుగా బతుకులీడుస్తున్నారు. ‘సంక్షేమం’ కాగితాల్లోనే పరిమితమైంది. లక్షల్లో కార్మికులకు ఏ చట్టాలు వర్తించడం లేదు.
ఐఎల్‌ఓకి సంబంధించిన 2024 ఇండియా ఎంప్లాయిమెంట్ నివేదిక ప్రకారం 2019 తర్వాత భారతదేశంలో అసంఘటిత కార్మికులు పెరిగి దాదాపు 90 శాతం అయ్యారు. ఇది సప్లయి చెయిన్స్ ద్వారా యాప్‌ల ఆధారంగా నడిచే ప్లాట్‌ఫార్మ్ కార్మికులు, గృహ ఆధారిత పరిశ్రమల కార్మికులుగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా మిగులు తున్నారు.
సామాజిక అసమానతల దృష్ట్యా చూస్తే ఈ సవాలు మరీ తీవ్రంగా ఉంటుంది. మా అధ్యయనం ప్రకారం విద్య, లాంఛనప్రాయంగా రిజిష్టరైన పరిశ్రమలు, స్కిల్ శిక్షణ పొందిన కార్మికుల్లో గౌరవప్రదమైన జీవితాలుంటున్నాయి. ఏమైనా, అసంఘటిత కార్మికులకు ఇవన్నీ అసాధ్యమౌతున్నాయి. మరీ ముఖ్యంగా కులం, లింగబేధాల్లో ఇవి ప్రస్ఫుటమవుతున్నాయి. గిరిజన, బీసీ, మహిళల్లో మా అధ్యయనకాలంలో గౌరవప్రదమైన జీవితాలు దిగజారితే, పురుషుల్లో కొంత మెరుగైనాయి. 2019లో కోవిడ్ తర్వాత మహిళలపైనా, సామాజికంగా అణగారిన కులాలపైనా త్రీవ ప్రభావం చూపింది. దీన్నిబట్టి మన దేశంలో అసమానతలు ఆర్థికంగానే కాదు, సంస్థాగతంగా కుల వ్యవస్థలోను, పితృస్వామ్య వ్యవస్థలోనూ వేళ్లూనుకుని ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు కూడా లేబర్ మార్కెట్ పురోగతిలో ముఖ్యమైనవి. కేరళం, తమిళనాడు, హర్యానాలు గౌరవప్రదమైన జీవన పరిస్థితుల తయారీలో ముందుండగా, దీనికి భిన్నంగా బీహార్, జార్ఖండ్, యూపీలు వెనకపడే వున్నాయి. విధానపరమైన అంశాల్లో ఈ అధ్యయనం ఒక కీలకాంశాన్ని ముందుకు తెచ్చింది.
భారతదేశంలో ఉద్యోగావ కాశాలు పెరిగినా, గౌరవప్రదమైన పని పరిస్థితులను భద్రతనిచ్చేందుకు దేశం ఇప్పటికీ వెనకబడే ఉంది.
నాసిరకమైన ఉద్యోగ సృష్టి ఆర్థికరంగంలో కూడా అనేక పరిణామాలకు దారితీస్తోంది. సాంఘిక భద్రతలేని కార్మికులు తక్కువ ఖర్చు పెడ్తారు, తక్కువ ఆదా చేస్తారు. ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతారు. పైగా, అసంఘటిత రంగం పెరగడం ఉత్పాదకతను తగ్గిస్తుంది. పన్నులు కట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అసమానతలను పెంచుతుంది. భారతదేశం లేబర్ మార్కెట్ విజయాన్ని నిరుద్యోగిత రేట్ల తగ్గింపును, ఆదాయాల పెరుగుదల ద్వారా మాత్రమే కొలవలేదు. ఒక దేశం 2047కల్లా వికసిత భారత్‌గా అవతరించాలనుకుంటే తక్కువ వేతనాలతో, అభ్రదతతో, అరక్షితంగా పనిచేసే కార్మికులతో సాధించలేదు. భారతదేశం ఉద్యోగాలను లెక్కించుకోవడం మాని నాణ్యమైన ఉపాధి కల్పనవైపు దృష్టి మరల్చాలి.
ముందుకు మార్గం
ఇందులోని సూత్రీకరణలు విధానం ఎటు మళ్లాలో సూచిస్తున్నాయి. ఒకటి, గిగ్, ప్లాట్ ఫార్మ్ కార్మికుల స్వయం ఉపాధి పొందేవారికి, రైతులకు, అసంఘటిత కార్మికులతో సహా అందరికీ సాంఘిక భద్రత కల్పించబడాలి. వారి ఉపాధి స్టేటస్‌తో సంబంధం లేకుండా ఎక్కడికైనా సులభంగా మార్చుకోగలిగేలా అది ఉండాలి. ‘ఈశ్రమ్’ వంటి ప్లాట్‌ఫార్మ్స్ ప్రారంభం ఘనంగానే ఉంది. అయితే దానిలో రిజిష్టర్ చేయించుకోవడంతోనే సాంఘిక భద్రతకు గ్యారంటీ ఉండదు.
కార్మికులకు నిజమైన రక్షణ కావాలి. డేటాబేస్ ఎంట్రీకాదు. రెండు లాంఛనప్రాయమైన విధానాలు కార్మికుల జీవన పరిస్థితులపై దృష్టిపెట్టాలి. అంతేగానీ వ్యాపారాల రిజిస్ట్రేషన్ కాదు. ఏ సంస్థకైతే పన్ను మినహాయింపులు, సబ్సిడీలు పొందుతాయో అవి తప్పనిసరిగా, రాతపూర్వక ఒప్పందాలు, జీతాలతో కూడిన సెలవులు, సాంఘిక భద్రతకు తమ వాటా చెల్లించాలనే షరతులు పెట్టాలి.
మూడవది : అంతర్చేదన (అంటే ఒక వ్యక్తి సామాజిక గుర్తింపులు, కులం, లింగం, వర్గం, మతం, వయసు, వైకల్యం ఒక్కొక్కటిగా కాకుండా పరస్పరం కలగలిసి, వారిపై వివక్షను ఎలా సృష్టిస్తాయో విశ్లేషించే భావన) కార్మిక విధానంలో అంతర్భాగమవ్వాలి. ఈ విధంగా చూస్తే అణగారిన కులాలలోని స్త్రీ కార్మికుల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని బిడ్డల సంరక్షణ, రవాణా సౌకర్యాలు, స్కిల్ ట్రైనింగ్, పని ప్రదేశంలో వివక్ష వంటి వాటిపై గురిపెట్టాలి. చివరిగా, సులభతర వ్యాపార లక్ష్యంగా కాకుండా కార్మికుల శ్రేయస్సును గమనంలో ఉంచుకుని కార్మిక విధానాలుండాలి.
నాలుగు లేబర్ కోడ్స్ 2025లో చేసినపుడు కార్మిక నియంత్రణ, రక్షణలు విస్తరణ లక్ష్యాలుగా చెప్పారు. ఆచరణ పాక్షికంగానూ, అసంగతంగానూ ఉంది. వ్యాపారాల సులభతరం చేస్తూ కాంట్రాక్టీకరణను విస్తరిస్తున్నారు. దాంతో కార్మికులకున్న రక్షణలు తొలగించి వేయబడ్తున్నాయి. కార్మికులకు ఏదో ఒక పని ఉందా లేదా అని కాదు, ఆ పని వారికి గౌరవాన్ని సురక్షిత స్థితిని ఇస్తోందా లేదా అనేది ముఖ్యం. అప్పటివరకు, భారతదేశ ఉపాధి కల్పనా విజయాలు కథ అసమగ్రమే. దేశ శ్రామికశక్తి అభద్రతతో ఉన్నంతవరకూ ఏ దేశమూ తనని తాను అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించుకోలేదు.
(హిందూ సౌజన్యంతో)
అనువాదం : ఆరెస్బీ
తగ్గిన నిరుద్యోగంలో పెరిగిన నాసిరకం ఉపాధి
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026 | 4 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)