ఇరాన్‌పై తాజా దాడులకు ఇజ్రాయిల్, అమెరికా సమాయత్తం
మా భూభాగంలోకి వస్తే మరణ క్షేత్రమే : టెహ్రాన్ హెచ్చరిక
టెల్ అవీవ్ : మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై సరికొత్త దాడులు జరిపేందుకు అమెరికా సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఇజ్రాయిల్ వైపు నుంచి అందుతున్న కీలక సమాచారం ప్రకారం...ఇరాన్ అణు కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరపడానికి ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్), అమెరికా సైన్యం సంయుక్తంగా వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇరాన్‌లోని అత్యంత లోతైన భూగర్భ అణు కేంద్రం పికాక్స్ పర్వతంపై కూడా దాడి చేయాలన్నది ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. దాడుల కోసం ఇజ్రాయిల్ వైమానిక దళం అమెరికాతో కలిసి యుద్ధ విన్యాసాలు, రిహార్సల్స్ జరిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, అణు ఇంధన శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్షంగా సన్నాహాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇరాన్ లోపలికి వస్తే అంతే
ఇరాన్‌లోని భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికాకు చెందిన 22,000 పౌండ్ల అత్యంత శక్తివంతమైన 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' వంటి ఆయుధా లను ఉపయోగించే విషయంపై ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరుపుతున్నారు. కాగా ఇజ్రాయిల్ సన్నాహాల నేపథ్యంలో ఇరాన్ కూడా పూర్తిస్థాయిలో అప్రమ త్తమైంది. తమపై ఎలాంటి దాడి జరిగినా సరిహద్దులకు ఆవల అత్యంత భీకరమైన ప్రతి దాడులు జరుపుతామని, శత్రు సేనలు తమ భూభాగంలో ప్రవేశిస్తే అది వారికి 'మరణ క్షేత్రం' అవుతుందని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ, ఆర్మీ అధికారులు హెచ్చరించారు. ఓ వైపు ఖతార్ వంటి దేశాల మధ్య వర్తిత్వంతో శాంతియత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇరాన్‌పై భారీ దాడు లకు సన్నాహాలను ఇజ్రాయిల్ పూర్తి చేసింది.
బలాబలాల మోహరింపు
ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయిల్ అధునాతన ఆయుధా లను సిద్ధం చేసింది. ఇజ్రాయిల్ అమ్ముల పొదిలో భూగర్భ బంకర్లను ఛేదించే బాంబులు, ఇరాన్ రాడార్లకు చిక్కకుండా దాని గగనతలంలోకి దూసుకెళ్లే ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు, విమానాల నుంచి ప్రయోగించే దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిని తిప్పికొట్టడానికి ఇరాన్ కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. దాని వద్ద రష్యా నుంచి పొందిన శక్తివంతమైన ఎస్-300, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బావర్-373 క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిని తన అణు కేంద్రాల చుట్టూ ఇరాన్ మోహరించింది. వీటితో పాటు శత్రువుల రక్షణ వలయాలను ఛేదించే హైపర్ సోనిక్ క్షిపణులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి.
పది నిమిషాల్లో ఇరాన్ అణు సామర్ధ్యాన్ని అంతం చేస్తా : ట్రంప్
తమ దేశంపై దాడి చేస్తే దీటుగా సమాధానమిస్తామంటూ ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము తలచుకుంటే ఇరాన్ అణు సామర్ధ్యాన్ని కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించారు. ఇప్పటికే ఇరాన్ అణు సామర్ధ్యాన్ని చాలా వరకూ దెబ్బతీశామని, మరో రెండు లక్ష్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిలో పికాక్స్ పర్వతం కూడా ఉన్నదని తెలిపారు. ఇరాన్ నాయకు లను ఎన్నటికీ నమ్మబోనని అన్నారు. దాడులు చేయాలని అనుకుంటే అందరికీ చెప్పి చేస్తానా అని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఏ విధంగా, ఏ స్థాయిలో దాడి చేసినా దీటైన సమాధానం ఇవ్వాలని అంతకుముందు మొజ్తాబా తన సేనలకు పిలుపునిచ్చారు. ఈసారి తమ ప్రతి దాడులకు భౌగోళిక సరిహద్దులేవీ ఉండవని ఆయన హెచ్చరించారు.






కామెంట్లు (0)