భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు నేటి నుంచి
చారిత్రక విజయంపై టీమ్ ఇండియా గురి
తెల్లవారుజామున 3.30 నుంచి సోనీనెట్వర్క్లో..
న్యూజిలాండ్ పర్యటనలో వైట్‌బాల్ ఫార్మాట్లో టీ20, వన్డే సిరీస్‌లను సాధించిన టీమ్ ఇండియా.. అందని ద్రాక్షలా ఊరిస్తోన్న టెస్టు సిరీస్‌పై కన్నేసింది. వెల్లింగ్టన్ టెస్టులో ఐదు రోజులు ఆధిపత్యం చెలాయించినా విజయానికి దూరమైన శుభ్‌మన్‌సేన.. క్రైస్ట్‌చర్చ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు నేటి నుంచి షురూ.
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా, క్రైస్ట్‌చర్చ్‌లో ఏ జట్టూ డ్రా కోరుకోవటం లేదు. విజయంతో డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్-2లోకి రావాలని న్యూజిలాండ్.. గెలుపుతో అవకాశాలను మెరుగుపర్చుకోవాలనే తపనతో టీమ్ ఇండియా కనిపిస్తున్నాయి. దీంతో ఇరు జట్లు ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకు అనుగుణంగానే నేడు హాగ్లే ఓవల్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి. తొలి టెస్టులో పరుగుల వరద పారగా.. క్రైస్ట్‌చర్చ్‌లో సీమర్లకు అనుకూలించే పిచ్‌ను సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆరంభం కానుంది.
ఆ ఇద్దరు ఆడేనా?
తొలి టెస్టులో టీమ్ ఇండియా రాణించింది. కివీస్ గడ్డపై అత్యధిక స్కోరు బాదింది. కానీ టెస్టు మ్యాచ్‌లో విజయానికి 20 వికెట్లు అనివార్యం. మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం ఆధారంగా బౌలర్లను ఎంచుకుంటే.. ఆఖరు రోజు ఆటలో 8 వికెట్లు కూడా పడగొట్టలేని దుస్థితి చవిచూడక తప్పదు. వెల్లింగ్టన్లో సీమర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ రవీంద్ర జడేజా బెంచ్‌కు పరిమితం అయ్యారు. ఆఖరు రోజు ఆటలో ఈ ఇద్దరు బంతితో భిన్నమైన ప్రభావం చూపేవారు. సిరాజ్, జడేజాలను పక్కనపెట్టడంపై తీవ్ర విమర్శలు రేగాయి. పేస్‌కు అనుకూలించే హాగ్లే ఓవల్లోనైనా మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంటారా? లేదంటే విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుని మళ్లీ పక్కనపెడతారా? అనేది చూడాలి. ఇక్కడ చివరి రెండు రోజులు పిచ్ నుంచి అనూహ్య బౌన్స్ లభిస్తుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఈ పరిస్థితుల్లో వికెట్ల వేట ప్రభావశీలంగా చేయగలడు. తుది జట్టు కూర్పులో టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్ లైనప్‌లో కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోసారి అందరూ సమిష్టిగా మెరిస్తే పరుగుల వేటల భారత్‌కు డోకా ఉండదు. బౌలింగ్ బృందానికి జశ్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనుండగా.. ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణతో పాటు సిరాజ్, కాంబోజ్‌లలో ఒకరు పేస్ బృందంలో నిలువనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరు ఆడనున్నారు.
గెలుపుపై కివీస్ గురి
ఆతిథ్య న్యూజిలాండ్ తొలి టెస్టులో నిరాశపరిచింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పరిస్థితుల్లో భారత్‌కు తలొగ్గింది. పిచ్ ఆఖరు రోజు సైతం బౌలింగ్‌కు అనుకూలించలేదు. లేదంటే, తొలి టెస్టులో ఆ జట్టుకు దారుణ ఓటమి మిగిలేది. క్రైస్ట్‌చర్చ్‌లో ఆ పొరపాటుకు తావులేకుండా పిచ్‌ను పేస్ మయం చేశారు. తొలి రెండు రోజులు పిచ్ నుంచి పేస్, స్వింగ్, బౌన్స్ బాగా లభించనున్నాయి. మాట్ హెన్రీ, కైల్ జెమీసన్, జాకబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్‌లు పేస్ సవాల్ విసిరేందుకు సిద్ధమవుతుండగా, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయకు సై అంటున్నాడు. కెప్టెన్ టామ్ లేథమ్ తొలి టెస్టులో నిరాశపరిచినా, ఇక్కడ మెరిసేందుకు ఎదురుచూస్తున్నాడు. డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డార్లీ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్‌లు కొందరు రాణించినా ఆతిథ్య జట్టు బ్యాటింగ్ కష్టాలు తీరినట్టే. రెండో టెస్టులో కివీస్ బ్యాటింగ్‌పై కాకుండా, 20 వికెట్లు పడగొట్టగిలిగే బౌలింగ్ బృందంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
క్రైస్ట్‌చర్చ్ హాగ్లే ఓవల్ పిచ్ అదనపు బౌన్స్‌తో పేస్ బౌలర్లకు అనుకూలం. తొలి రెండు రోజులు పేస్‌కు సహకరించనుంది. మూడో రోజు నుంచి పిచ్ అనూహ్య బౌన్స్‌కు దారితీసే అవకాశం ఉంది. హాగ్లే ఓవల్ పిచ్ ఐదు రోజులు ఒకే తరహాలో స్పందించదు. మ్యాచ్‌కు ముందు వర్షం పడినా.. టెస్టు మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్ : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్/రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్/మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జశ్‌ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : టామ్ లేథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జెమీసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫ్ఫీ.







కామెంట్లు (0)