Magazines

చాంపియన్‌ యువ భారత్‌

5 గంటల క్రితం

Young India, the Champion
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

రికార్డు తొమ్మిదో టైటిల్‌ సొంతం

ఫైనల్లో పాక్‌‌పై వికెట్‌ తేడాతో గెలుపు

అండర్‌19 మెన్స్‌ ఆసియా కప్‌

అల్‌ అమరత్‌ (ఒమన్‌) : అండర్‌19 ఆసియా కప్‌‌లో యువ భారత్‌ అదరగొట్టింది. పాకిస్తాన్‌‌పై వికెట్‌ ‌తేడాతో గెలుపొంది రికార్డు తొమ్మిదో టైటిల్‌ ‌కైవసం చేసుకుంది. ఆఖరు బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్‌ 1 ‌వికెట్‌ ‌తేడాతో గెలుపొందింది. 338 పరుగుల భారీ ఛేదనలో టీమ్‌ ఇండియా ఓ దశలో 252/8తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. మోహిత్‌ ఉల్వ (49 నాటౌట్‌, 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అసమాన ఇన్నింగ్స్‌‌తో భారత్‌‌ను విజేతగా నిలిపాడు. మనాల్‌ ‌చౌహాన్‌ (47, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌‌కు 35 బంతుల్లోనే 57 పరుగులు జోడించిన మోహిత్‌.. ఆఖరు వికెట్‌‌కు వెంకట సుభాశ్‌ (11 నాటాట్‌)‌తో జతగా 16 బంతుల్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఆఖరు బంతికి భారత్‌‌కు 3 పరుగులు అవసరం కాగా.. మోహిత్‌ ‌బౌండరీ బాది భారత్‌‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. అంతకుమందు, ఓపెనర్లు లక్ష్య రాయ్‌‌చందని (80, 101 బంతుల్లో 5 ఫోర్లు), అర్యవీర్‌ ‌సెహ్వాగ్‌ (58, 61 బంతుల్లో 9 ఫోర్లు) తొలి వికెట్‌‌కు 95 పరుగులు జోడించి శుభారంభం అందించిన.. మిడిల్‌ ఆర్డర్‌ ‌తేలిపోయింది. వికె వీనత్‌ (24), అర్జున్‌ (16), యశ్‌‌బర్దన్‌ (9), అన్వయ్‌ ‌ద్రవిడ్‌ (19), ఆర్యన్‌ ‌(9), పరేశ్‌ ‌పటేల్‌ (0) ‌నిరాశపరిచారు. ఈ విజయంతో గత ఏడాది ఫైనల్లో ఓటమికి భారత్‌ ‌ప్రతీకారం తీర్చుకుంది. అండర్‌19 ఆసియా కప్‌‌ను 1989, 2003, 2012, 2014, 2016, 2018, 2019, 2021, 2026లో భారత్‌ ‌సొంతం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ‌ఖాన్‌ (107, 111 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) సెంచరీతో రాణించగా.. అబ్దుల్‌ ‌ఖాదిర్‌ (80, 54 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌‌లు), ఫర్హాన్‌ ‌యూసుఫ్‌ (63, 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పరేశ్‌ ‌పటేల్‌ (4/68), వెంకట సుభాశ్‌ (3/40) రాణించారు. ‌ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌‌గా మోహిత్‌ ఉల్వ, ప్లేయర్ ఆఫ్‌ ‌ది టోర్నీగా ఆర్యవీర్‌ ‌సెహ్వాగ్‌ ‌నిలిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్