నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఇజ్రాయిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. 690 మిలియన్ షెకెళ్ల (NIS) వ్యయంతో భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆ దేశ వ్యాప్తంగా 12,018 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇందులో భాగంగా 6,209 పోలింగ్ కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు. వీటిలో 3,621 కేంద్రాలు ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. ఈ భారీ ఎన్నికల ప్రక్రియ కోసం 12 మిలియన్ల ఓటింగ్ కవర్లు, 18,000 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల కోసం 250 టన్నుల కాగితాన్ని సిద్ధం చేశారు.
ఆ దేశవ్యాప్తంగా ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ఓటింగ్ జరుగునుంది. 73 లక్షల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. అదే విధంగా ఎన్నికల కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల రోజున పనిచేసే లక్ష మంది సిబ్బందితో పాటు, ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించే 1,500 మంది కీలక పరిపాలనా సిబ్బంది, క్షేత్రస్థాయిలోని ఇన్స్పెక్టర్లకు 15,000 బాడీ కెమెరాలను అమర్చి నిఘా పెంచారు.
పోలింగ్ ముగిసిన వెంటనే (అక్టోబర్ 27 రాత్రి నుంచే) ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28 తెల్లవారుజాముకల్లా ప్రాథమిక ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 4న అధికారిక ఫలితాలను ప్రకటిస్తారు.
ఇజ్రాయెల్ పార్లమెంటరీ వ్యవస్థ, 'నెసెట్' (Knesset) లోని 120 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు కనీసం 3.25% ఓట్ల పరిమితిని (electoral threshold) దాటాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాల మెజారిటీ అవసరం.
పశ్చిమ ఆసియాలో సున్నితమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇరాన్ తో అనవసరం యుద్ధం, గాజాపై మారణోమం ప్రస్తుత ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రతికూల అంశాలు. యుద్ధ కారణంగా ఇజ్రాయిల్ ఆర్థిక పరిస్థితి క్షిణించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో అనైతిక చర్యలకు పాల్పడటంతో నెతన్యాహుపై స్వదేశంలో వ్యతిరేకత పెరిగింది. ఈ అంశాలు ఆ దేశ ప్రతిపక్ష పార్టీలకు సానుకూలంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో నెతన్యాహుకు గెలుపు కత్తిసాము లాంటిదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమిలో జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్-గ్విర్కు చెందిన ఓట్జా యెహుదిత్ వంటి అతివాద పార్టీలతోపాటు, షాప్, యునైటెడ్ తోరా జడాయిజం వంటి అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలు ఉన్నాయి. యషార్ పార్టీ నాయకుడు గాడి ఐసెన్కోట్, బేయాహాద్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ ప్రధాని పదవికి పోటీపడుతున్నారు. రేపటి ఎన్నికలతో నెతన్యాహు భవితవ్యం ఏంటో తెలనుంది.






కామెంట్లు (0)