నవతెలంగాణ - ముధోల్
ముధోల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందీర్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,ప్రజలకు అందిస్తున్న వివిధ పోలీస్ సేవలు, షీ టీమ్స్,సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆయుధాల పనితీరుతో పాటు తదితర అంశాలపై ముధోల్ సిఐ రవీందర్ నాయక్ అవగాహన కల్పించారు.
నేరస్తులను గుర్తించడంలో ఉపయోగించే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు విధానాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఏదైనా నేరం లేదా సమస్య జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సూచించారు. అవసరమైతే నేరుగా సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రజలకు మరింత భరోసా, నమ్మకం కలిగేలా పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చే బాధితుల సమస్యలను సానుకూలంగా విని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చట్టపరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి, తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలలో బాసర ఎస్ హెచ్ ఓ దీపక్, ముధోల్, తానూర్, లోకేశ్వరం ఎస్ఐలు, పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)