నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియను(సర్) ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సర్ సర్వేను నిలిపి వేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పలు రోజులుగా భారీ నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియపై కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, మిజోరం, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) చేపట్టనున్నట్లు ఈసీ గురువారం ప్రకటించింది.
అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారికి అవకాశం కల్పించనున్నారు. 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీల నాటికి ఓటు హక్కు పొందే అర్హత సాధించేవారి నుంచి ముందస్తు దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుంది.
ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 30న విడుదల చేయనున్నారు. తుది ఓటర్ల జాబితాను 2027 జనవరి 21న ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియకు అవసరమైన సిబ్బంది, వనరులను సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను ఎన్నికల సంఘం ఆదేశించింది.






కామెంట్‌లు (0)