- డీడీఓ బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ - అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని నూతన ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఉద్యానశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన బోధన, పరిశోధన, రైతు విస్తరణ సేవలు, పరిపాలనా రంగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2018లో శాస్త్రవేత్తగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ బాధ్యతలు చేపట్టడం విశేషం.
ఉన్నత విద్య..
పరిశోధనలో నైపుణ్యం:
డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం. మోజర్లలోని ఉద్యాన కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ పూర్తి చేశారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాలలో ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ అరోమాటిక్ క్రాప్స్ విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్) పట్టా పొందారు. పశ్చిమబెంగాల్‌లోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం నుంచి ఉద్యానశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
శాస్త్రవేత్తగా ప్రస్థానం:
2018లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా చేరారు. అనంతరం మోజర్ల, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. బోధనతో పాటు పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్త, అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర ఉద్యాన పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, పంటల సమస్యల పరిశీలన, రైతులకు సాంకేతిక సూచనలు, శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
విద్యార్థులు, రైతులకు మరిన్ని సేవలు:
అసోసియేట్ డీన్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ నేతృత్వంలో ఉద్యాన విద్య నాణ్యత పెంపు, విద్యార్థుల పరిశోధనలకు ప్రోత్సాహం, ఆచరణాత్మక నైపుణ్యాల అభివృద్ధి, కళాశాల మౌలిక సదుపాయాల బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యం లభించనుంది. ఉద్యాన రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, పరిశోధన ఫలితాలను రైతులకు చేరువ చేయడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి మరింత తోడ్పడే అవకాశం ఉంది.
గ్రామీణ నేపథ్యం నుంచి ఉద్యానశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి, శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ అసోసియేట్ డీన్‌గా నియమితులు కావడం విశేషం.







కామెంట్‌లు (0)