నవతెలంగాణ-ఆలేర్ రూరల్ : రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విత్తనాల కోసం ప్రైవేట్ డీలర్లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రైతు ఆరుట్ల విజేందర్ రెడ్డి పొలంలో వరిలో నాణ్యమైన విత్తనోత్పత్తిపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పాక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాబార్డ్ ప్రాజెక్టు–2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సహకారంతో కొలనుపాకకు చెందిన ఇద్దరు రైతులు బెదరబోయిన శంకరయ్య, ఆరుట్ల విజేందర్ రెడ్డికి కె ఎన్ ఎం -1638 వరి రకం విత్తనాలను విత్తనోత్పత్తి కోసం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ వీకే ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ డి. శ్రీలత మాట్లాడుతూనాణ్యమైన విత్తనాలను రైతుల వద్దే ఉత్పత్తి చేయించి స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడమే నాబార్డ్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.జిల్లా సహకార అధికారి నాగార్జున మాట్లాడుతూ పాక్స్ ద్వారా రైతుల నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరించి, శుద్ధి చేసి తిరిగి ఇతర రైతులకు విత్తనాలుగా అందించే విధానం ద్వారా ప్రైవేట్ విత్తన డీలర్లపై ఆధారపడడాన్ని తగ్గించవచ్చని వివరించారు.రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఎదగడంతో పాటు ఇతర రైతులకు కూడా నాణ్యమైన విత్తనాలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.నాబార్డ్ డీడీఎం ఝాన్సీరాణి మాట్లాడుతూ.. నాబార్డ్ అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆలేరు వ్యవసాయ సహాయ సంచాలకురాలు నిర్మల మాట్లాడుతూనాణ్యమైన విత్తనోత్పత్తిలో పాటించాల్సిన వ్యవసాయ మెళకువలు, సాంకేతిక పద్ధతులు, రైతులకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు.మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వ్యవసాయ శాఖ అందించే సహకారం, సాంకేతిక సూచనలను తెలియజేశారు.విత్తనోత్పత్తి చేపడుతున్న రైతులు బెధరబోయిన శంకరయ్య, ఆరుట్ల విజేందర్ రెడ్డి తమ అనుభవాలను పంచుకుంటూ.. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అందుతున్న సాంకేతిక సలహాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.అనంతరం రైతులతో ముఖాముఖి ని01ర్వహించి విత్తనోత్పత్తికి సంబంధించిన సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ సీఈఓ వెంకటరెడ్డి, పాక్స్ సిబ్బంది,వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్, రైతులు,పాక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)