నవతెలంగాణ మిడ్జిల్ : విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణించగలరని, అందుకు వసతి గృహ పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తారని వైద్యాధికారి డాక్టర్ మీర్జా అలీ పేర్కొన్నారు. మండలంలోని వస్పుల ప్రభుత్వ వసతి గృహంలో సోమవారం వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వసతి గృహంలోని 111 మంది విద్యార్థులందరికీ సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులను అందజేశారు. వసతి గృహం చుట్టుపక్కల మురుగునీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వసతి గృహంలో అందించే పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ అయ్యుబ్ ఖాన్, హాస్టల్ వార్డెన్ రవి కుమార్,ఆరోగ్య సిబ్బంది సంపత్ కుమార్, పారిజాత, ఆశ కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)