- ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు శభాష్ !!
- బేతుపల్లిలో వరద ఉధృతిలో చిక్కుకున్న మత్స్యకారులు, బాధితులు సురక్షితం
- ఎస్డీఆర్‌ఎఫ్‌ను ఆధునిక పటిష్టతతోనే ప్రాణనష్టం నివారణ
నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు అంచనాలు రూపొందించండి:
- రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- క్షేత్రస్థాయిలో శ్రమించి, సేవలందించిన యంత్రాంగానికి మంత్రి పొంగులేటి ప్రశంసల జల్లు
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరద విపత్తును సమన్వయంతో ఎదుర్కొని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ప్రాణాలను, ఆస్తులను కాపాడిన అధికార యంత్రాంగం, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. గురువారం సత్తుపల్లిలోని సింగరేణి గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలతో కలిసి వరద సహాయక చర్యలు, ముంపు నష్టాలపై మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి హెడ్‌క్వార్టర్స్ పరిధిలో జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాత్రి సమయంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మత్స్యకారులు, ప్రజలను రక్షించడానికి వెళ్లిన ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు. సోషల్ మీడియాలో బోట్లు బోల్తా పడినట్లు ప్రచారంతో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా అందరినీ సురక్షితంగా కాపాడగలిగామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రాత్రి వేళల్లో స్వయంగా రెండు పర్యాయాలు మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారని గుర్తుచేశారు.
2023 డిసెంబర్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2024 ఆగస్టులో మున్నేరు వాగు ఉప్పొంగినప్పుడు జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో భాగంగా పోలీసు శాఖ నుంచి 1200 మందిని, ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి 700 మందిని ఎంపిక చేసి మొత్తం 1,900 మంది సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ఎస్డీఆర్‌ఎఫ్‌ను పటిష్టం చేశామన్నారు. సుమారు రూ. 260-270 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడం వల్లే రాష్ట్రంలో ఏ మూలన విపత్తు వచ్చినా 45-50 నిమిషాల్లోనే సహాయక చర్యలు అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర ప్రాంతాలలో విద్యుత్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.
మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తెగడం, చెరువులు పొంగిపొర్లడంతో దెబ్బతిన్న వరి ఇతర పంటలను గుర్తించాలన్నారు. కేవలం అధికారుల అంచనాలే కాకుండా, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు స్వయంగా ఫీల్డ్ విజిట్లు నిర్వహించి నిజమైన బాధితులను గుర్తించి 2-3 రోజుల్లో పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్‌ను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. అలాగే నిరంతరం శ్రమించిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో ఇళ్లు లేని అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
సమీక్షలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ... సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద తెప్ప బోటుతో వెళ్లి చిక్కుకుపోయిన 8 మంది మత్స్యకారులను, రెస్క్యూ సిబ్బందిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ లొకేషన్ ట్రేసింగ్ ఉపయోగించి రాత్రి వేళల్లోనూ సురక్షితంగా రక్షించామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వెంటనే యంత్రాంగం అప్రమత్తమైందని, ముల్కలపల్లి ప్రాంతంలో చెట్లు, వరద నీటిలో చిక్కుకున్న మహిళ, యువకుడు, 11 మంది గిరిజనులను ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు డ్రోన్లు, లైఫ్ జాకెట్ల సాయంతో క్షేమంగా రక్షించాయని తెలిపారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ మాట్లాడుతూ... పోలీసు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖల సమన్వయంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్లు విజయవంతంగా ముగిశాయని వెల్లడించారు.
ఈ సమీక్షలో సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్లు పి. శ్రీనివాస రెడ్డి, వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆసుపత్రికి వెళ్లి ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మత్స్యకారులకు పొంగులేటి పరామర్శ
బేతుపల్లి వరద ఉధృతికి గల్లంతై సురక్షితంగా చేరుకొని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సయ పొందుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మత్స్యకారులను మంత్రి పొంగులేటి పరామర్శించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు.
బేతుపల్లి చెరువు ఉప్పొంగిన సమయంలో విపత్తు ముప్పు ఉన్న గ్రామాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడాన్ని ఆయన అభినందించారు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని గురువారం మంత్రి పరామర్శించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)