- గల్లంతయిన 16 మంది సురక్షితం
- అర్ధరాత్రి సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువు వద్ద నిన్న (బుధవారం) సాయంత్రం మొదలైన ఉత్కంఠకు చివరకు సుఖాంతమైంది.
చెరువులో ప్రమాదవశాత్తు చిక్కుకున్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం పడవ బోల్తా పడింది. దీంతో మత్స్యకారులతో పాటు సహాయక బృందం కూడా చెరువులోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. చీకటిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి వేళ సాహసోపేతంగా వ్యవహరించి మొత్తం 16 మందిని ఒడ్డుకు చేర్చారు. సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ క్షేమంగా బయటపడ్డారు.
క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ
సంఘటన జరిగినప్పటి నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాత్రంతా చెరువు వద్దే ఉన్నారు.
పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తూ బాధితుల కుటుంబాలకు ధైర్యాన్ని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు అందించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ చర్యలను సమన్వయం చేశారు. నాయకులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్ల సహాయక చర్యలు వేగవంతంగా జరిగాయి. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో స్థానిక ప్రజలు, మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు.
రెస్క్యూ బృందాలకు మంత్రి తుమ్మల అభినందనలు
గురువారం ఉదయం బేతుపల్లి చెరువును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బేతుపల్లి చెరువు సందర్శించారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు.
చీకటి సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో అందరినీ కాపాడిన విధానం ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కృషిని, జిల్లా అధికారుల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున రెస్క్యూ బృందాలన్నింటికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సకాలంలో స్పందించి పెద్ద ప్రమాదాన్ని తప్పించిన జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజలందరూ అభినందిస్తున్నారు.






కామెంట్‌లు (0)