- కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
- నల్లగొండ కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
- సీపీఐ ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్
నవతెలంగాణ-సత్తుపల్లి
రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమని, కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్ అన్నారు. గురువారం స్థానిక రావి వీర వెంకయ్య ప్రజాసంఘాల భవనంలో జరిగిన సమావేశంలో రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనే ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై, నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం, సమస్యల పరిష్కారం కోసం రైతులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ రంగ పరిరక్షణ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, అన్ని పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం, రైతుల రుణ విమోచన వంటి కీలక అంశాలపై ఈ జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల సాధన కోసం అఖిల భారత కిసాన్ సభ సాగిస్తున్న పోరాటాలను ప్రతీ గ్రామంలోనూ మరింత బలోపేతం చేయాలన్నారు.
చారిత్రాత్మక తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఈ 36వ జాతీయ మహాసభల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాతంత్ర వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మాచర్ల భారతి, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు, జాజిరి శ్రీనివాస్, సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘ డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, తల్లాడ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, సీఐటీయూ నాయకుడు మాచర్ల గోపాల్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)