Magazines

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

1 గంట క్రితం

Miyapur lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ ఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నెంబర్లు 100, 101లలోని 550 ఎకరాల విలువైన ప్రభుత్వ భూముల వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ రెండు సర్వే నెంబర్లలో ఉన్న రూ.వేల కోట్ల విలువైన భూమి తమదేనంటూ గతంలో కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ఆక్రమణకు ప్రయత్నించారు. అయితే, 2003 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ, తెలంగాణ ప్రభుత్వ హక్కులను సమర్థించింది. ఈ విస్తారమైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవను మరియు కృషిని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశంసించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, మియాపూర్ భూములకు సంబంధించి గతంలో ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయాన్ని 2003లోనే హైకోర్టు సమర్థించింది. అయితే, జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధ వారసులైన అమీరున్నిషా, ఇతరుల నుంచి 'Irrevocable GPA', 'సనద్' ద్వారా ఈ భూములను తాము చట్టబద్ధంగా పొందామని పార్థసారధి, సువిశాల్ జైన్‌లు కోర్టును ఆశ్రయించారు. రిజిస్టర్డ్ పత్రాలను రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని, తమ హక్కులకు ఆటంకం కలగకుండా చూడాలని వారు వాదించారు.

ఈ వాదనలపై ప్రభుత్వ న్యాయవాదులు సుదీర్ఘంగా స్పందిస్తూ బలమైన ఆధారాలను కోర్టు ముందుంచారు. పూర్వపు జాగీర్దార్ కైసరుద్దీన్‌కు అప్పట్లోనే తగిన పరిహారం చెల్లించడం పూర్తయిందని, కాబట్టి ఆయన వారసులమని చెప్పుకుంటున్న వారికి గానీ, లేదా వారి నుండి GPA పొందిన వారికి గానీ ఈ భూములపై ఎలాంటి హక్కులను క్లెయిమ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. కోట్లాది రూపాయల విలువైన ప్రజా భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా అనుమతించబోమని, ఇలాంటి తీవ్రమైన విషయాల్లో న్యాయస్థానం మౌనంగా ఉండలేదని స్పష్టం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను కొట్టివేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్