- లాభాలతో ముగిసిన ఆయిల్ ఇయర్ –2025 - 26
- నాలుగున్నర లక్షల టన్నులు దాటి రికార్డు స్థాయిలో క్రషింగ్
- ఏడాదంతా రూ.20 వేలకుపైగా కొనసాగిన గెలల ధర
- 20.01 శాతం ఓఈఆర్‌తో దేశంలోనే అత్యుత్తమ ఫలితం
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆయిల్‌పామ్ రైతులకు గడిచిన ఆయిల్ ఇయర్ పలు రికార్డులతో పాటు లాభాల పంటను మిగిల్చింది. ఆర్థిక సంవత్సరం, విద్యా సంవత్సరం మాదిరిగానే ఆయిల్‌ఫెడ్ నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఒక సంవత్సరాన్ని ఆయిల్ ఇయర్ గా పరిగణిస్తుంది. 2025 నవంబర్ 1 న ప్రారంభమైన ఆయిల్ ఇయర్ –2025 - 26 అక్టోబర్ 31 తో ముగిసింది. ఈ ఏడాది తెలంగాణలోని మూడు ఆయిల్‌పామ్ పరిశ్రమల్లో కలిపి సుమారు 4.73 లక్షల టన్నుల గెలలను క్రషింగ్ చేసి కొత్త రికార్డు సృష్టించారు.
అశ్వారావుపేట, అప్పారావుపేట, సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని పరిశ్రమల్లో ఆయిల్‌పామ్ గెలల క్రషింగ్ జరుగుతోంది. గత ఆయిల్ సంవత్సరంతో పోలిస్తే ఈసారి సుమారు 1.43 లక్షల టన్నుల మేర అదనంగా గెలలు పరిశ్రమలకు చేరాయి. కొత్తగా సాగులోకి వచ్చిన ఆయిల్‌పామ్ తోటల నుంచి సుమారు 65 వేల నుంచి 70 వేల టన్నుల గెలలు వచ్చినట్లు గణాంకాలను బట్టి అంచనా వేస్తున్నారు.
మూడు పరిశ్రమల్లో భారీ క్రషింగ్
ముగిసిన ఆయిల్ సంవత్సరంలో అశ్వారావుపేట పరిశ్రమలో సుమారు లక్ష టన్నులు, అప్పారావుపేటలో 2.93 లక్షల టన్నులు, నర్మెట్ట పరిశ్రమలో 80 వేల టన్నుల వరకు గెలలను క్రషింగ్ చేశారు. 2023-24లో మూడు పరిశ్రమల్లో కలిపి 2.73 లక్షల టన్నులు, 2024-25లో 3.30 లక్షల టన్నుల గెలలు క్రషింగ్ చేయగా, తాజాగా ఆ సంఖ్య 4.73 లక్షల టన్నులకు చేరడం ఆయిల్‌పామ్ రంగం విస్తరణకు నిదర్శనంగా నిలిచింది.
ఏడాదంతా ధరల పండగే..
ఈ ఆయిల్ సంవత్సరంలో రైతులకు ధరల పరంగా ఊరట లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పొడవునా గెలల ధర టన్నుకు రూ.20 వేల దిగువకు పడిపోకపోవడం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. ఆగస్టులో టన్ను గెలల ధర రూ.24,025 పలికి కొత్త రికార్డు నమోదు చేసింది.
నవంబర్‌లో రూ.19,598తో ప్రారంభమైన ధరలు, జనవరి నుంచి క్రమంగా పెరిగాయి. మార్చిలో రూ.23,005, ఏప్రిల్‌లో రూ.23,501, మేలో రూ.23,852కు చేరాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు రూ.23 వేలకుపైగా ధరలు కొనసాగడం రైతుల ఆదాయానికి దన్నుగా నిలిచింది.
నెలవారీగా గెలలు.. ధరలు
నెల | గెలలు (టన్నుల్లో) | ధర (టన్నుకు రూ.) |
నవంబర్ | 26,403 | 19,598 |
డిసెంబరు | 14,042 | 19,694 |
జనవరి | 9,709 | 20,456 |
ఫిబ్రవరి | 8,375 | 21,546 |
మార్చి | 12,930 | 23,005 |
ఏప్రిల్ | 28,870 | 23,501 |
మే | 48,305 | 23,852 |
జూన్ | 58,760 | 23,783 |
జులై | 63,490 | 23,488 |
ఆగస్టు | 73,873 | 24,025 |
సెప్టెంబరు | 75,763 | 23,641 |
అక్టోబరు | 53,075 | 22,658* |
*అక్టోబరు ధర అధికారిక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
దేశంలోనే అత్యధిక ఓఈఆర్
ముగిసిన ఆయిల్ సంవత్సరంలో మూడు పరిశ్రమల సరాసరి నూనె దిగుబడి శాతం (ఓఈఆర్) 20.01 శాతంగా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఆయిల్ సంవత్సరంలో సరాసరి ఓఈఆర్ 19.27 శాతం ఉన్నప్పటికీ, అప్పారావుపేట పరిశ్రమ 19.62 శాతం ఓఈఆర్‌ను పరిగణనలోకి తీసుకుని రైతులకు గెలల ధరను నిర్ణయించింది. ఈసారి 20 శాతం మార్కును దాటడం ఆయిల్‌పామ్ సాగు, పరిశ్రమల నిర్వహణలో మెరుగైన ఫలితాలకు సూచికగా భావిస్తున్నారు.
మరోవైపు, అప్పారావుపేట పరిశ్రమ ఒక్క నెలలోనే 50,150 టన్నుల గెలలను క్రషింగ్ చేసి రికార్డు నమోదు చేయడం ఈ ఆయిల్ సంవత్సరంలోని మరో విశేషంగా నిలిచింది.
చివర్లో కాస్త నిరాశ..
ఏడాదంతా రైతులను సంతోషపరిచిన ధరలు చివరి నెలలో మాత్రం కొంత తగ్గాయి. అక్టోబర్‌లో సేకరించిన గెలలకు టన్నుకు రూ.22,658 ధరను నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. నవంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్టులో రూ.24,025 వరకు చేరిన ధర అక్టోబర్ నాటికి తగ్గడం రైతుల్లో కొంత నిరాశను మిగిల్చింది.
అయితే, ధరల స్థిరత్వం, రికార్డు స్థాయి క్రషింగ్, 20.01 శాతం ఓఈఆర్, కొత్త తోటల నుంచి పెరుగుతున్న దిగుబడితో ఆయిల్ ఇయర్–2025-26 మొత్తం మీద ఆయిల్‌పామ్ రైతులకు లాభదాయకమైన సంవత్సరంగానే నిలిచింది. దేశంలో ఆయిల్‌పామ్ తోటల విస్తరణలో తెలంగాణ అగ్రభాగాన నిలవడం కూడా ఈ రంగం భవిష్యత్ అవకాశాలకు సంకేతంగా కనిపిస్తోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కొనసాగడంతో పాటు పరిశ్రమల సామర్థ్యం పెరిగితే రానున్న ఆయిల్ సంవత్సరంలో మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)