Magazines

పరిమితులను ఛేదించి కొత్త శిఖరాలను అధిరోహించాలి

1 గంట క్రితం

limits
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

ఐఐటీ ఖరగ్‌పుర్‌ వజ్రోత్సవాల్లో ప్రధాని మోడీ

75 ఏండ్ల ప్రస్థానానికి గుర్తుగా ప్రత్యేక స్మారక నాణెం ఆవిష్కరణ


ఖరగ్‌‌పూర్‌ : జీవితంలో కొత్త శిఖరాలకు చేరుకోవాలంటే ముందుగా తమకు తాముగా విధించుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందాలని, తమ ఆశయాలు, ఆకాంక్షలను విస్తరించుకోవాలని ప్రధాని మోడీ శనివారం విద్యార్ధులకు ఉద్బోధించారు. స్వతంత్ర భారతంలో తొలి ఐఐటీ అయిన ఐఐటి ఖరగ్‌‌పూర్‌ ‌ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని, విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. ‘దేశానికే తొలుత ప్రాధాన్యత’ అన్న విధానాన్ని ప్రజలు అవలంబిస్తే నూతన అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. ‘‘మనకు పరిమితులను విధించే నమ్మకాలు వున్నాయి. మన ఆలోచనలు, కలలు, ఆకాంక్షలు, ఆశయాలకు, మన ప్రతిభకు పరిమితులు పెట్టుకుని ప్రయత్నాలను వదిలేస్తాం. కానీ ఈ పరిమితులను మనం ఛేదించగలిగితేనే మన పూర్తి స్థాయి సామర్ధ్యాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాం, కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తాం.’’ అని మోడీ పేర్కొన్నారు.

ప్రధానిగా తన హయాంలో తాను ఇలాంటి పరిమితులను చాలా ఛేదించానని, ప్రజలు అసాధ్యం అనుకున్న ఇటువంటి అనేక లక్ష్యాలను సాధించానని మోడీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ నిర్మాణంలో ఐఐటీ ఖరగ్‌‌పూర్‌ ‌గణనీయమైన పాత్ర పోషించిందని గుర్తు చేసుకున్నారు. అభివృద్ది చెందిన భారత్‌ ‌దార్శనికతకు తన సేవలందిస్తూనే వుందన్నారు. ప్రపంచ బ్యాంక్‌ ‌నివేదికను ఉటంకిస్తూ గత 12, 13ఏండ్ల లో దాదాపుగా 50కోట్ల మంది ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 2047నాటికి వికసిత్‌ ‌భారత్‌ ‌దార్శనికతను సాధించడంలోనూ ఐఐటీ ఖరగ్‌‌పూర్‌ ‌ప్రధాన పాత్ర పోషించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ ఖరగ్‌‌పూర్‌ డైరెక్టర్‌ ‌ప్రొఫెసర్‌ ‌సుమన్‌‌ చక్రవర్తి మాట్లాడుతూ, తమ సంస్థ పూర్వ విద్యార్ధి, గూగుల్‌ ‌సీఈఓ సుందర్‌‌ పిచాయ్‌ అప్లైడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెనెన్స్‌పై పరిశోధనలకు గానూ 50లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చారని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, ఉన్నత విద్యా శాఖ మంత్రి జగన్నాథ్‌ ‌చటోపాధ్యాయ ప్రభృతులు ఈ ఉత్సవాలకు హాజర య్యారు. అనంతరం బీహార్ లో నితీశ్ సేతు వంతెనను మోడీ ప్రారంభించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్