Magazines

పార్లమెంట్‌ అధికారాలను హరించిన ఈసీఐ

1 గంట క్రితం

ECI has encroached upon the powers of Parliament
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

ఓటరు నమోదు నిబంధనల ఉల్లంఘనకు ఈసీ అఫిడవిటే సాక్ష్యం

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి ప్రాసిక్యూట్‌ చేయాలి : 
పీపుల్‌ అగ్నెస్ట్‌ సర్‌ డిమాండ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఓటరు నమోదు ప్రక్రియలో అదనపు నిబంధనలను విధించడంతో ఎన్నికల కమిషన్ (ఈసీఐ) పార్లమెంటు అధికారాలను ఉల్లంఘించిందని పీపుల్‌ అగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్ (పీఏ-ఎస్‌ఐఆర్‌) విమ‌ర్శించింది. అక్టోబరు 26న సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్‌ సమర్పించిన అఫిడవిట్‌ ఈ ఉల్లంఘనకు రాతపూర్వక ఆధారంగా ఉందని పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6కు అదనపు డిక్లరేషన్‌ను ఎలక్ట్రానిక్‌ విధానంలో అనుసంధానించినట్టు కమిషన్‌ అంగీకరించిందని తెలిపింది. ఈ చర్య చట్టబద్ధమైన అధికార పరిధిని అతిక్రమించడమేనని విమర్శించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పీపుల్‌ అగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌ అఖిల భారత సమన్వయ కమిటీ బుధ‌వారం ప్రకటన విడుదల చేసింది.

చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమించారు

ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 ప్రకారం ఓటరు నమోదు నిబంధనలను రూపొందించే, మార్చే అధికారాన్ని పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని పీఏ-ఎస్‌ఐఆర్‌ పేర్కొంది. చట్టంలో స్పష్టంగా పేర్కొనని అదనపు షరతును విధించి పౌరుల ఓటు హక్కు వినియోగానికి ఆటంకం కలిగించే అధికారం ఏ పరిపాలనా సంస్థకూ లేదని తెలిపింది.

ఫారం-6తో అదనపు డిక్లరేషన్‌ను ఐటీ పోర్టల్‌తో అనుసంధానించినట్టు ఎన్నికల కమిషన్‌ అఫిడవిట్‌లో పేర్కొనడం కీలకమని వివరించింది. ఈ విధానంలో రెండు పత్రాలను కలిపి సమర్పించకుండా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని దుయ్య‌బ‌ట్టింది. చ‌ట్టబద్ధమైన హక్కును వినియోగించుకునే ప్రక్రియలో పరిపాలనా ఆదేశాలతో కొత్త షరతును తప్పనిసరి చేయడం, ఆచరణలో చట్టాన్ని సవరించడంతో సమానమని పేర్కొంది. ఐటీ వ్యవస్థలో అదనపు డిక్లరేషన్‌ను ఫారం-6కు తప్పనిసరిగా అనుసంధానించడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ పార్లమెంట్‌ అధికార పరిధిలోకి జోక్యం చేసుకున్నారని విమర్శించింది. ఈ చర్యను కేవలం సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటుగా ఎన్నికల కమిషన్‌ సమర్థించడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

సీఈసీకి పదవీ రక్షణ
చట్ట విరుద్ధమైన చర్యలకు మినహాయింపు కాదు

​ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు సమానమైన కఠినమైన అభిశంసన ప్రక్రియ అవసరమనే వాదన, ఎన్నికల కమిషన్‌ తన అధికార పరిధిని అతిక్రమించిందన్న ఆరోపణను పక్కదారి పట్టించలేదని పీఏ-ఎస్‌ఐఆర్‌ పేర్కొంది. పదవీ రక్షణ అనేది చట్టవిరుద్ధమైన చర్యలకు మినహాయింపు కాదని స్పష్టం చేసింది.

బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే సర్‌

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (‌సర్‌), ఫారాల్లో చేసిన మార్పులు అధికారంలో ఉన్న ‌బీజేపీకి లబ్ది చేకూర్చేందుకేనని పీఏ-ఎస్‌ఐఆర్‌ విమ‌ర్శించింది. పారదర్శకత లేకుండా 13 కోట్లకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్యగా పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. సర్‌‌ను రద్దు చేయాలని, ఓటు హక్కు కోల్పోయిన పౌరులందరి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరింది. పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పీపుల్‌ అగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌ అఖిల భారత సమన్వయ కమిటీ ప్రకటించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్